విజయవాడ మేయర్ సీటు టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఏర్పడిన రాజకీయ బంధానికి అగ్నిపరీక్షగా మారిందా.? ఇరు పార్టీల ఇంటి పోరు ప్రత్యర్థి పార్టీకి వరం కాబోతుందా.? విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అత్యంత కీలకమైన ప్రాంతం. రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే ఈ ప్రాంతం పై ఇటు టీడీపీ, అటు జనసేన పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుకుని కుర్చున్నారా.?
ఒకరకంగా విజయవాడ మేయర్ అభ్యర్థి కోసం టీడీపీ పార్టీలోనే అంతర్గత పోటీ గట్టిగా కనిపిస్తుంది. ఇటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు బోండా సిద్దార్ధ్ ని విజయవాడ మేయరు అభ్యర్థి బరిలో ఉంచేందుకు ఇప్పటికే పార్టీ అధిష్టానంతో చర్చలు మొదలుపెట్టారు.
ఇక టీడీపీ మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని కుటుంబం కూడా మేయర్ సీటు పై కన్నేశారు. అలాగే ఇటు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైతం ఆయన సతీమణి గద్దె అనురాధ పేరు ను తెరమీదకు తెచ్చారు. ఇలా ఒక్క టీడీపీ పార్టీలోనే అనేకమంది సీనియర్ నాయకులు విజయవాడ మేయర్ సీటు మాకంటే మాకు అంటూ అధిష్టానం తో సంప్రదింపులు సాగిస్తున్నారు.
ఇటువంటి కీలక స్థానంలో జనసేన కూడా తన ఉనికి కోసం టీడీపీ తో సైతం ఫ్రెండ్లీ పోరుకి సిద్దమయ్యింది. రాజకీయాలకు కేంద్ర బింధువైన విజయవాడలో ఇప్పటి వరకు జనసేనకు రాజకీయ అస్తిత్వం లేదు. ఇటు ఎమ్మెల్యే కానీ అటు ఎంపీ స్థానంలో కానీ కూటమి పొత్తు కారణంగా జనసేనకు అవకాశం చిక్కలేదు. సుజనా చౌదరి రూపంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ కి అవకాశం దొరికినా జనసేన కు మెండి చెయ్యి మిగిలింది.
కాబట్టి విజయవాడ మేయర్ సీటు ఎట్టి పరిస్థితులలోను జనసేన కు దక్కితీరాల్సిందే అన్న గట్టి పట్టుదలలో పవన్ కళ్యాణ్ సైతం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటువంటి తరుణంలో మరి జనసేన అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగనున్నారు అనే ప్రశ్న సహజంగానే టీడీపీ నుంచి వ్యక్తమవుతుంది.
అయితే ఇందుకు పవన్ దగ్గర బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న నేత ఉన్నారా.? ఉంటే ఎవరు.? అంటూ జనసేన వైపు ఎన్నో వేళ్ళు లేస్తున్నాయి. మేయర్ ఎంపిక ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో ఖచ్చితంగా పార్టీలకు బలమైన రాజకీయ పలుకుబడి ఉన్న నేత అత్యవసరం.
అయితే తాజాగా వంగవీటి రాధా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో రాధా జనసేన నుంచి విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా అన్న చర్చ మొదలయ్యింది. అయితే ప్రస్తుతానికి వంగవీటి రాధ టీడీపీ పార్టీలో కొనసాగుతున్నారు.
అలాగే తనకు మేయర్ స్థానం కోసం పోటీ చేసే ఆసక్తి లేదంటూ రాధ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు వార్తలు ప్రచారంలో వచ్చాయి. ఇటువంటి పరిస్థితులలో విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి ఎవరు అన్నది ఇక్కడ కీలకంగా మారనుంది.







