టీడీపీ – జనసేన బంధానికి, ఐక్యతకు విజయవాడ ఆదర్శం

Vijayawada Mayor Seat Brings TDP, Jana Sena Together

కూటమి పొత్తులో భాగమైన టీడీపీ , జనసేన పార్టీల మధ్య ఏర్పడిన రాజకీయ బంధం ఎన్నికలు వచ్చేసరికి సోషల్ మీడియాలో యుద్దాలకు దారి తీస్తాయి. మా పార్టీ గొప్పంటే మా పార్టీ గొప్పంటూ, మా అధినేతే నెంబర్ 1 అంటే మా అధినేతే నెంబర్ 1 అంటూ ఇలా పార్టీల అధినేతలకు లేని భావనను పార్టీ క్యాడర్ మోస్తారు.

అయితే ఇందులో ఏ ఒక్క పార్టీ కూడా తగ్గేదెలా అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా అంతర్గత యుద్దానికి తెరలేపుతారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మూడు పార్టీల మధ్య మొదలైన సీట్ల పంచాయితీ మరోమారు ఇరు పార్టీల శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో రచ్చకు కారణమయ్యింది.

ADVERTISEMENT

జనసేనకు అన్యాయం జరిగిందంటూ జనసైనికులు, బలానికి మించి ఆశిస్తున్నారంటూ టీడీపీ తమ్ముళ్లు ఎవరి వాదనను వారు బలంగా వినిపించారు. అలాగే ఇరు పార్టీలలోనూ ఆశావాహులు, అసంతృప్తి నేతలు అధినేతలకు తలనొప్పులుగా మారారు.

ఇటువంటి కీలక సమయంలో కూడా రాష్ట్ర రాజకీయాలకు అత్యంత కీలక నగరమైన విజయవాడ మేయర్ సీటు పై టీడీపీ, జనసేన మధ్య పెద్ద చర్చే జరిగింది. చివరికి విజయవాడ మేయర్ సీటు జనసేన పార్టీకి దక్కింది. దీనితో వంగవీటి రాధ టీడీపీ నుంచి జనసేన కు షిఫ్ట్ కొట్టి మేయర్ సీటు చేజిక్కించుకున్నారు.

అయితే రాధా టీడీపీ నుంచి జనసేన కు మారడం వెనుకున్న రాజకీయ కారణాలను ఇరు పార్టీల లీడర్లు, క్యాడర్లు పక్కకి పెట్టారు. వంగవీటి రాధా మా వాడంటే మావాడు అన్నట్టుగా రాధా మేయర్ నామినేషన్ కార్యక్రమంలో రాధా తో పాటుగా జనసేన నాయకులు, టీడీపీ నేతలు కలిసి ముందుకెళ్లారు.

టీడీపీ నుంచి బెజవాడ మేయర్ సీటు ఆశించిన గద్దె కుటుంబం నుంచి బోండా ఫ్యామిలీ వరకు వంగవీటి రాధకు మద్దతుగా ముందుకొచ్చారు. అలాగే టీడీపీ నేత బుద్ధా వెంకన్న, గద్దె అనురాధ ఇలా టీడీపీ ప్రముఖ నాయకులు సైతం రాధా నామినేష్ ర్యాలీలో పాల్గొని టీడీపీ శ్రేణులకు ఓటు చిలకూడదు అనే మంచి సందేశాన్ని ఇచ్చారు.

దానితో పాటుగా విజయవాడ రాజకీయాలలో కూటమి కి ఉన్న ప్రాముఖ్యతను చాటి చెప్పారు. తమ పార్టీల అధినేతల ఆశయాలకు, ఆశలకు వారధిగా విజయవాడను నిలిపారు. అలాగే టీడీపీ, జనసేన రాజకీయ బంధానికి, ఐక్యతకు విజయవాడ రాజకీయాలను ఆదర్శంగా చేసి చూపించారు టీడీపీ, జనసేన నేతలు. బెజవాడ కేంద్రంగా ఇరు పార్టీల నేతల మధ్య ఉన్న ఈ సఖ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉండగలిగితే కూటమి ప్రభంజనాన్ని అడ్డుకోవడం వైసీపీ తరం కాకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories