ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లలో కొడుతున్న చితక్కొట్టుడు… బహుశా ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో కొడితే ప్రపంచమంతా “కోహ్లి” నామస్మరణ చేసేదేమో..! అవును… ఖచ్చితంగా… అని చెప్పవచ్చు. బౌలర్లపై ఏ మాత్రం కనికరం లేకుండా కోహ్లి కొడుతున్న షాట్లకు వీక్షకులు ముగ్దులవుతుంటే… బౌలర్లు మాత్రం నిస్సహాయులుగా మారిపోతున్నారు. ప్రతి మ్యాచ్ బెంగుళూరు జట్టుకు ‘క్లైమాక్స్’ కావడంతో, అన్నీ తానై అద్వితీయమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ బరిలో నిలపడానికి కష్టపడుతున్నాడు కోహ్లి.
ఈ సీజన్ ముందు వరకు ఒక్క సెంచరీ కూడా చేయని కోహ్లి, ఈ సిరీస్ లో ఇప్పటివరకు 4 సెంచరీలు బాదాడు. అంతేకాదు, బెంగుళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరితే ఒకే సీజన్లో 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా విరాట్ సరికొత్త చరిత్రకు శ్రీకారం సృష్టించే అవకాశం కూడా దక్కుతుంది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా 4000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు. ఇండియాకు లభించిన మేటి క్రికెటర్లలో కాస్త నిలకడతో కూడి వేగంగా పరుగులు చేసే బ్యాట్స్ మెన్ సచిన్ ఒక్కడే. అయితే వేగంగా పరుగులు చేయకున్నా నిలకడగా ఆడడంలో రాహుల్ ద్రావిడ్ స్పెషల్.
వీరిద్దరిని కలిపితే విరాట్ కోహ్లి అన్నట్లుగా ఉంది. సచిన్ కొట్టిన విధంగా భారీ ఇన్నింగ్స్ లు ఆడడం, ద్రావిడ్ ప్రదర్శించిన విధంగా నిలకడగా ఆడుతూ క్రికెట్ పై ఉన్న క్రేజ్ ను మరింతగా పెంచేస్తున్నాడు. కోహ్లి ఆడిన గత 25 టీ 20 ఇన్నింగ్స్ లను పరిశీలిస్తే… 113, 75*, 109, 7, 20, 108*, 52, 14, 100*, 80, 33, 79, 75, 89*, 82*, 24, 55*, 23, 41*, 56*, 49, 7, 50, 59*, 90* కేవలం ఆరింటిలో మాత్రమే అంచనాలను అందుకోలేక విఫలమయ్యాడు. అందులోనూ రెండు మాత్రమే సింగిల్ డిజిట్ లు. దీంతో ఈ మేరకు కోహ్లి పరుగుల యంత్రం పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం అంతా… కోహ్లి మరో సచిన్ కాదు… కోహ్లి ఒక కోహ్లియే అంటూ కీర్తిస్తున్నారు. కాదనలేం మరి!



