బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకి వచ్చిన ఓ కంటెయినర్‌లో లక్షల కోట్లు విలువ చేసే 25,000 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. దీనిపై సాక్షి, ఈనాడు మీడియా రెండు భిన్నమైన కధనాలు ప్రచురించడం విశేషం. అసలు ఈ సరుకు ఎవరిది?అనే సందేహాలు కలుగక మానవు.
సాక్షి మీడియా కధనం ప్రకారం ఈ సరుకుని వీరభద్రరావు ఎండీగా, ఆయన కుమారుడు కూనం కోటయ్య ‘చౌదరి’ సీఈవోగా ఉన్న విశాఖలోని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ రప్పించుకుంది. వారితో టిడిపి నేతలకు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యులకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి.
బ్రెజిల్ నుంచి విశాఖకు ఆక్వా ఫీడ్ పేరుతో రవాణా అవుతున్న కంటెయినర్‌లో మాదకద్రవ్యాలున్నట్లు ఇంటర్ పోలింగ్ పసిగట్టి, సీబీఐకి ఈమెయిల్ ద్వారా తెలియజేసింది. వెంటనే ఢిల్లీ నుంచి సీబీఐ డీఎస్పీ ఉమేశ్ శర్మ విశాఖ చేరుకొని స్థానిక సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్, మరో ఎస్పీ ఆకాష్ కుమార్ మీనా తదితరులతో కలిసి ఈ నెల 19న విశాఖ పోర్టు చేరుకొని ఆ కంటెయినర్‌ని స్వాధీనం చేసుకున్నారు.
దానిలో వచ్చిన బ్యాగులను తెరిచి చూడగా, ‘డ్రై ఈస్ట్’లో కలిపిన నిషేధిత కొకైన్, ఓపియం, మారిజోనా, హషీష్, మెథాక్వాలోన్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ అధికారులు సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ డైరెక్టర్లను ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు.
సీబీఐ అధికారులు ఆ కంపెనీ మీద కేసు నమోదు చేశారు. ఇది సాక్షి కధనం. కంపెనీ యజమానులు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కనుక వారందరూ టిడిపి నేతలే లేదా టిడిపితో సంబంధాలు ఉన్నట్లేనని సాక్షి మీడియా నిర్ధారించేసింది.
ఈ వ్యవహారం గురించి ఈనాడులో కూడా ఓ వార్త వచ్చింది. అయితే సీబీఐ అధికారులు ఆ కంటెయినర్‌ని తెరవకుండా అడ్డుకునేందుకు, తెరిచిన తర్వాత ‘సరుకు’ని పరీక్షించకుండా అడ్డుకునేందుకు వైసీపి నేతలు తమ పలుకుబడిని ఉపయోగించి విశ్వప్రయత్నాలు చేశారని ఈనాడు పేర్కొంది.
ఇంతకీ ఈ సరుకు ఎవరిది?ఎందుకు రప్పించారు?ఒకవేళ ఇది టిడిపి నేతలదే అనుకుంటే కంటెయినర్ తెరవకుండా వైసీపి నేతలు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు?అనే ప్రశ్నలకు త్వరలో సీబీఐ జవాబు చెపుతుంది.
‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ డైరెక్టర్ కూనం హరికృష్ణ దీనిపై స్పందిస్తూ, “మేము తొలిసారిగా బ్రెజిల్ నుంచి రొయ్యలకు ఆహారం దిగుమతి చేసుకున్నాము. ఆ దేశంలోని సదరు సంస్థ ఇది ‘రొయ్యల ఆహారం’ అని పంపిన సర్టిఫికేట్ కూడా మా వద్ద ఉంది. కానీ మాకు అక్కడి నుంచి వచ్చిన ఈ కంటెయినర్‌లో మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయో మాకు తెలీదు. సీబీఐ అధికారుల దర్యాప్తు చేసి కనుగొనవలసి ఉంది. వారికి మేము పూర్తిగా సహకరిస్తాము,” అని చెప్పారు.
సరిగ్గా ఎన్నికలకు ముందు ‘వైసీపి రాజధాని’లో ఈ సరుకు దిగడంతో ఇది కూడా ఎన్నికలలో పంచి పెట్టేందుకేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.




