విశాఖ ఆర్‌కె బీచ్ వద్ద జగన్ ప్రభుత్వం సుమారు కోటిన్నర ఖర్చు చేసి సముద్రంపై తెలియాడే ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’ ఏర్పాటు చేసి, గత ఆదివారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేత కొబ్బరికాయ కొట్టించింది. దానిపై సముద్రంలో వంద మీటర్ల దూరం వెళ్ళి సందర్శకులు నిలబడేందుకు ఏర్పాటు చేసిన ‘టీ ప్లాట్ ఫారం’ సోమవారమే బ్రిడ్జి నుంచి విడిపోయి సముద్రంలో కొంత దూరం కొట్టుకుపోయింది.
అదే విషయం ప్రతిపక్షాలు, మీడియా చెపితే వైసీపికి దాని ఆత్మసాక్షికి చాలా కోపం వచ్చింది. ఫ్లోటింగ్ బ్రిడ్జిపైకి సందర్శకులని అనుమతించే ముందు, దాని ధృఢత్వం, వారి భద్రతని పరీక్షించేందుకు దాని నిర్వాహకులే టీ-ప్లాట్ ఫారంని బ్రిడ్జి నుంచి విడదీసి ‘మాక్ డ్రిల్’ నిర్వహిస్తుంటే, అసూయతో రగిలిపోతున్న ప్రతిపక్షాలు, వాటి బాకా మీడియా ఫ్లోటింగ్ బ్రిడ్జి సముద్రంలో కొట్టుకుపోయిందంటూ దుష్ప్రచారం చేస్తూ, జగన్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆవేదన పడింది.
అయితే ఆర్‌కె బీచ్‌లో ఉవ్వెత్తున ఎగసిపడే అలల ధాటికి మళ్ళీ ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి భాగాలు విడిపోయి సముద్రంలో కొట్టుకుపోయాయి. సముద్రంపై అది తేలుతూ ఉండేందుకు బ్రిడ్జికి ఇరువైపులా అమర్చిన ఖాళీ డబ్బాల వంటి భాగాలు కూడా విడిపోయి కొట్టుకుపోయాయి. వాటిలో కొన్ని దెబ్బ తిన్నట్లు అక్కడే ఉన్న సందర్శకులు చెపుతున్నారు.
సాధారణంగా సముద్రంలో ఉదయం పూట అలల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. సాయంత్రం అవుతున్న కొద్దీ తీవ్రత పెరుగుతుంతుంది. అమావాస్య, పౌర్ణమి సమయాలలో మరింత ఎక్కువగా ఉంటుంది. కనుక సముద్రంలో పెద్దగా అలలు ఉండని ప్రాంతాలలో ఇటువంటివి ఏర్పాటు చేస్తే తట్టుకోగలవు. కానీ విసిరి కొడుతున్నట్లు ఎగసిపడే కెరటాలను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తట్టుకోలేక విడిపోతోంది.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వచ్చి దానిని పరిశీలించి దానిపైకి సందర్శకులను అనుమతించవద్దని నిర్వాహకులకు చెప్పి వెళ్ళారు. ఇంతకీ ఫ్లోటింగ్ బ్రిడ్జి మళ్ళీ విడిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయింది కదా… ఇదీ మాక్ డ్రిల్లే అంటారా? మాష్టారు?




