విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించి రైల్వే స్టేషన్ అధికారులు పంపిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)కి రైల్వేబోర్డు ఆమోదం తెలిపిందని మీడియాలో ప్రధాన వార్తగా వచ్చింది. కానీ ఆ వివరాలను నిశితంగా పరిశీలిస్తే, కొత్తగా మంజూరు చేసిన వాటి కంటే ఆస్తుల బదిలీలు, నియామకాలకు సంబందించిన అంశాలే ఎక్కువగా కనపడతాయి.
కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇటువంటి సర్వసాధారణమే కనుక విశాఖ కేంద్రంగా రైల్వే రైల్వే జోన్ ఏర్పాటుకి మెల్లగా అడుగులు పడుతున్నందుకు సంతోషించాలి.
ఇంతవరకు ఈ కొత్త రైల్వే జోన్ పేరుని ‘విశాఖ రైల్వే జోన్’ అని అనుకుంటే దీనిని ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌గా మార్చినట్లు అర్ధమవుతోంది. పేరులో ఏముందిలే… విశాఖలో రైల్వే జోన్ ఏర్పడితే అదే చాలని సరిపెట్టుకోక తప్పదు. డీపీఆర్‌లో ఆమోదించిన ప్రతిపాదనలు, తిరస్కరించినవి, పక్కన పెట్టినవి:
ఆమోదించిన ప్రతిపాదనలు:
· విశాఖ కేంద్రంగా కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు.
· దక్షిణ మద్య రైల్వే జోన్‌కు చెందిన ఆస్తులు, ఆమోదిత పోస్టులు, సిబ్బంది బదలాయింపుకు ఆమోదం.
· రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్ నియామకానికి ఆమోదం.
తిరస్కరించినవి:
· దక్షిణ మద్య రైల్వే జోన్, తూర్పు కోస్తా రైల్వే జోన్‌ల పరిధిలో పనిచేస్తున్న ట్రాక్ మెషిన్లు వాటి సిబ్బంది బదిలీ ప్రతిపాదనని తిరస్కరించింది.
· విశాఖలో ముడసర్లోవ వద్ద ఒక రైల్వే హాస్పిటల్ నిర్మించాలనే ప్రతిపాదనని తిరస్కరించింది. (ఇప్పటికే విశాఖలో ఒకటి ఉంది కనుక.)
· గుణుపూర్-తేరుబలి రైల్వే లైన్ పూర్తయ్యే వరకు గుణుపూర్-పర్లాకిమిడి సెక్షన్, గుణుపూర్-నౌపాడ రైల్వే లైన్లను విశాఖ రైల్వే జోన్ పరిధిలో ఉంచాలనే ప్రతిపాదన తిరస్కరించింది.
పక్కన పెట్టినవి:
· విశాఖలో రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి రూ.200 కోట్లు నిధులు కేటాయింపు. పూర్తి వివరాలతో ఈ ప్రతిపాదన పంపిస్తే పరిశీలిస్తామని తెలిపింది.
సూచనలు, ఆదేశాలు:
· కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకాలకు ఆమోదం తెలుపుతూనే, కొత్తగా జీఎం పోస్టు తప్ప మరే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు సృష్టించకూడదని ఆదేశించింది.
· ప్రస్తుతం విశాఖ డివిజన్‌లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు విశాఖలో ఏర్పాటవుతున్న కొత్త రైల్వే జోన్‌లోనే కొనసాగుతారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందిని మాత్రం విభజిస్తారు.




