పిల్లల కోసమే బ్రతికేవారు ఈ లోకంలో చాలా మందే ఉన్నారు. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తమ జీవితాలలో చిన్న చిన్న సంతోషాలను కూడా వద్దనుకొని జీవిస్తున్న తల్లి తండ్రులే ఈ లోకంలో చాలా ఎక్కువ. కానీ ఇదే లోకంలో తమ అక్రమ సంబంధాలకు లేదా సుఖ సంతోషాలకు అడ్డుగా ఉన్నారని పిల్లలను చంపుకునేతల్లి తండ్రులు కూడా ఉన్నారు.
భార్యాభర్తల మద్య మనస్పర్ధలు పెరిగితే ఆత్మహత్యలు చేసుకుంటూ, తమతో పాటు పిల్లలను కూడా చంపుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 10-15 ఏళ్ళలో ఈ ధోరణి విపరీతంగా పెరిగింది.
ఈ విషయంలో నగర, పట్టణ వాసుల కంటే మారుమూల పల్లె ప్రాంతాలలో నివసిస్తున్న అక్షరజ్ఞానం లేనివారే నయం. భార్యాభర్తలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ రోడ్డున పడినా, పంచాయితీలు పెట్టుకొని విడిపోతున్నా పిల్లల జోలికి వెళ్ళడం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు పిల్లలను సాకుతూనే ఉంటారు.
కానీ నగరాలూ, పట్టణాలలో నివసిస్తున్నవారు, కాస్త లేదా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తూ సౌకర్యవంతమైన జీవితాలు జీవిస్తున్నవారు సైతం మనస్పర్ధలు వస్తే ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఏదో ఓ కారణం చేత తమ జీవితం వ్యర్ధం అయ్యిందని వారు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న అభం శుభం తెలియని పసి పిల్లలను సైతం చంపేసుకోవడమే ఎవరూ జీర్ణించుకోలేరు.
భార్యాభర్తల మద్య మనస్పర్ధలు, ఆర్ధిక సమస్యలు మొదలైతే తీవ్ర నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ మనం పరిష్కరించుకోలేని సమస్యల నుంచి బయటపడాలనుకుంటే చనిపోనవసరం లేదు. వాటికి దూరంగా పారిపోయి కూడా జీవించవచ్చు. జీవించి ఉంటేనే ఎప్పటికైనా ఆ సమస్యల కోసం ప్రాణం తీసుకోవడం ఎంత అవివేకమో అర్ధమవుతుంది.
కానీ తమ సమస్యలతో ఎటువంటి సంబంధమూ లేని చిన్నారులను తల్లితండ్రులే కర్కశకంగా చంపేస్తుంటే ఇక వారికి రక్షణ ఎక్కడ ఉంటుంది? తల్లితండ్రుల తప్పొప్పులకు, సమస్యలకు ఏవిధంగానూ భాధ్యులు కాని చిన్నారులను తమతో పాటు చనిపోవాలని కోరుకోవడం ఏం న్యాయం?
హైదరాబాద్, పాతబస్తీలో బాగా చదువుకొని, కలిగిన కుటుంబానికి చెందిన పృధ్వీలాల్ దంపతుల కధ కూడా ఇలాగే విషాదాంతం అయ్యింది. భర్తతో మనస్పర్ధలు ఏర్పడటంతో ఆమె రెండేళ్ళ చిన్నారితో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆమె ఓ ఛార్టడ్ అకౌంట్. విద్యావంతులైన చాలా మంది అక్షర జ్ఞానం లేని గ్రామీణ మహిళల కంటే ఇంత ఆవేశపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?అనే సందేహం కలుగుతుంది.
అక్షర జ్ఞానం లేని గ్రామీణ మహిళలు తమ జీవితాలు ఇలా తగలబడ్డాయని ఎంత ఆవేదన చెందినా సాధారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేయరు. మరోదారి చూసుకొని జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతుంటారు. కానీ చదువుకున్నవారు మాత్రం చాలా త్వరగా ఓటమిని అంగీకరించేసి ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే వారి కంటే గ్రామీణులకే మనో ధైర్యం ఎక్కువనుకోవాలేమో?
సమాజంలో ఎవరైనా హత్యకు గురైన వార్త చూసినప్పుడు వెంటనే అది తప్పు అని నిర్ధారణకు వచ్చేస్తాము. కానీ సొంత పిల్లలని తల్లితండ్రులే హత్య చేస్తున్నప్పుడు తప్పనిపించదా?తల్లి తండ్రులే యమకింకరులుయా మారితే లోకంలో చిన్నారులకు రక్షణ ఎలా?




