‘హూ కిల్డ్ బాబాయ్?’ ఆరేళ్ళు గడుస్తున్నా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. నత్త నడకలు నడుస్తున్న ఆ కేసు విచారణని చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటికే దొరికే అవకాశం లేదనిపిస్తుంది.
ఇప్పుడు సరిగ్గా అలాంటి ప్రశ్నే ‘హూ కిల్డ్ సతీష్ కుమార్?’ మళ్ళీ వినిపిస్తోంది. ఆయన తిరుమల విజిలెన్స్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు పరకామణిలో విదేశీ కరెన్సీ దొంగతనం జరుగుతోందనే విషయాన్ని బయటపెట్టారు.
పరకామణిలో విదేశీ కరెన్సీని లెక్కించే రవి కుమార్ దొంగతనాలు చేసేవాడని బయటపెట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. కానీ వైసీపీ హయంలోనే దొంగ-టిటిడీ రాజీ కుదిరిపోవడంతో ఆ కేసు అటకెక్కిపోయింది. సతీష్ కుమార్ టిటిడీలో పదవీ విరమణ చేసిన తర్వాత గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీస్ అధికారిగా చేస్తున్నారు.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు పరకామణి కేసు తెరుచుకుంది. ఈ కేసు హైకోర్టుకి కూడా చేరింది. కోర్టు ఆదేశం మేరకు మళ్ళీ ఈ కేసుపై సీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ నెల 6న సతీష్ కుమార్‌ని ప్రశ్నించారు. మళ్ళీ శుక్రవారం విచారణకు హాజరయ్యేందుకు గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో బయలుదేరిన అయన తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.
ఆయన సోదరుడు పిర్యాదు మేరకు గుత్తి జీపీఆర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని, సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం జరిపించారు. అయనని ఎవరో హత్య చేసి పట్టాలపై పడేసినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అయితే ఎవరు?ఎందుకు?
‘హూ కిల్డ్ సతీష్ కుమార్?’ అంటే… ఆయన పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని వైసీపీ సొంత మీడియా ఓ స్టోరీ అచ్చేసింది.
కానీ వేధింపులు భరించలేకపోతే మళ్ళీ విచారణకు హాజరయ్యేందుకు రైలెక్కి తిరుపతి ఎందుకు బయలుదేరారు? చేరేలోగా ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?అనే ధర్మసందేహాలకు జవాబు లభించలేదు. కానీ కొత్త విషయాలు తెలిశాయి. అదీ… మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత శైలజానాథ్ నోట!
“పరకామణి దొంగతనం కేసులో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలని సీఐడీ అధికారులు ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు. నిజానిజాలు తెలియాలంటే సుప్రీంకోర్టు జడ్జీ చేత విచారణ జరిపించాలి,” అని శైలజానాథ్ అన్నారు. ఈ వివరణతో ఎవరికైనా మరో ధర్మ సందేహం కలుగుతుంది.
ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలని సీఐడీ అధికారులు ఒత్తిడి చేస్తే, చెప్పేస్తే ఆయనకే ‘మేలు’ కలిగేది కదా? కానీ వద్దనుకొని ఆత్మహత్య చేసుకోవడం దేనికి? తాను ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాన్ని రోడ్డున పడుతుందని సతీష్ కుమార్‌కి తెలియదా? తెలిసీ చేసుకున్నారా?
ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే శైలజానాథ్ ఇచ్చిన వివరణతోనే సతీష్ కుమార్ నోరు విప్పితే ఎవరు చిక్కులో పడతారో స్పష్టమవుతోంది. కానీ పోలీసులు ఇంకా విచారణ పూర్తి చేయకముందే, పోస్టుమార్టం రిపోర్ట్ రాకముందే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని వైసీపీ నిర్దారించేసింది.
నాడు వివేకానంద రెడ్డి గొడ్డలి పోట్లతో హత్య చేయబడినప్పుడు గుండెపోటుతో చనిపోయారని తేల్చి చెప్పేసింది. అలాగే సతీష్ కుమార్ కూడా హత్య చేయబడలేదు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని వైసీపీ తేల్చి చెప్పేసింది.
వివేకానంద గుండె/గొడ్డలి పోటు కేసు ఆరేళ్ళుగా పూల నావలా సాగిపోతూనే ఉంది. ఈ కేసు కూడా అలాగే సాగిపోతుంది.
కనుక పోలీసులు, పోస్టుమార్టం చేసే వైద్యులు శ్రమ పడనవసరం లేదు. ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని కేసు క్లోజ్ చేసేయవచ్చు.
పరకామణి దొంగతనాన్ని బయటపెట్టిన సతీష్ కుమార్ చనిపోయారు కనుక ఆ దొంగతనం కేసుని కూడా క్లోజ్ చేసేయవచ్చు.
కానీ హూ కిల్డ్ బాబాయ్?హూ కిల్డ్ సతీష్?అనే ప్రశ్నలు మాత్రం మరో ఒకటి రెండు దశాబ్దాలపాటు వినిపిస్తూనే ఉంటాయి. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఏ క్రిమినల్ కేసు అయినా ఇలాగే ముగుస్తుంటుంది…. అని సరిపెట్టుకోవలసిందే!







