సంతాపాలు, నష్టపరిహారాలు తర్వాత అధ్యాయం ఇదేగా?

Why Bus Accidents Spark Short-Lived Outrage in India

ఒక రైలు, బస్సు లేదా విమాన ప్రమాదం జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతే ఏమవుతుంది?అంటే ముందుగా మీడియా అక్కడ రెక్కలు కట్టుకొని వాలిపోయి వార్తలు అందించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత అవి సోషల్ మీడియాలో మేధావులు దానిపై పోస్టు మార్టం చేస్తారు.

ఈ రెండు జరుగుతుండగా ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేతలు అందరూ దిగ్బ్రాంతి చెందడం మొదలవుతుంది. ఆ తర్వాత వారి సంతాప సందేశాలు వినిపిస్తాయి.

ADVERTISEMENT

ఈలోగా మృతదేహాలకు పోస్టు మార్టం, గాయపడిన వారికి నష్టపరిహారం ప్రకటనలు వస్తాయి. పోలీసులు లేదా సంబంధిత అధికారులు ప్రాధమిక దర్యాప్తు చేసి ఏదో చెప్తారు. మళ్ళీ దానిపై మీడియాలో చర్చ జరుగుతుంది.

విమానాలకు, రైళ్ళను సీజ్ చేసి జరిమానాలు వేయలేరు కనుక అవి యధాప్రకారం తిరుగుతుంటాయి. కానీ బస్సులు సీజ్ చేసి, జరిమానాలు విధించగలరు కనుక ఏపీలో విధించేస్తున్నారు.

ఈ రెండు మూడు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 289 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 7.08 లక్షలు వసూలు చేశారు. వాటిలో 18 బస్సులను సీజ్ చేశారు. ఈ హడావుడి మరో వారం పది రోజులు సాగిన తర్వాత క్రమంగా తగ్గిపోతుంది.

ఈలోగా మరో బస్సు బోల్తా పడినా, ప్రమాదానికి గురైనా ఆ వార్తలు బాగా హైలైట్ అవుతుంటాయి. ఈరోజు హైదరాబాద్‌లో మియాపూర్ నుంచి గుంటూరు బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోర్లా పడిన సంగతి అమెరికాలో ఉన్నవారికి కూడా తెలిసిపోయే ఉంటుంది.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 15 మంది మాత్రమే ప్రయాణికులున్నారు. వారిని స్థానికులు బయటకు తెచ్చి గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. దేశంలో ఇలాంటి మరికొన్ని బస్సు ప్రమాదాలు ఇంకా ఎక్కడెక్కడ జరిగాయో మీడియా వెతికి పట్టుకొని చెపుతుంది.

ఈ సీరియల్ బస్సు ప్రమాదాలు నిలిచిపోయే వరకు అందరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అంతా ‘మామూలే!’

మళ్ళీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కట్ అండ్ పేస్ట్ మాదిరిగా బస్సులు, మనుషులు, ప్రాంతాల పేర్లు, సంఖ్యలు మార్చుకొని సేమ్‌ టూ సేమ్ స్టోరీ చెప్పుకోవలసి రావచ్చు.

ఎందుకంటే, ప్రభుత్వాలను నడిపేవారు రాజకీయాలు, అభివృద్ధి, సంక్షేమ పధకాలతో బిజీగా ఉంటారు. అధికారులకు, సిబ్బందికి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా బస్సుల యజమానులకు రాజకీయ నేపధ్యం ఉండవచ్చు. లేకపోతే మరోలా బస్సులను ఆటంకం లేకుండా నడిపించుకోగల సమర్ధులు. కనుక అధికారులు హడావుడి కొనసాగిస్తే వారే నష్టపోతారు.

ప్రజలందరూ గజినీలా ‘షార్ట్ టైమ్‌ మెమొరీ లాస్’ కలిగినవారే. పైగా మనం ఎక్కిన బస్సుకి మాత్రం ఏమీ కాదని గట్టి నమ్మకంతోనే ఎక్కుతుంటారు.

కనుక ‘బస్సులలో అగ్నిప్రమాద నివారణ’ అనే థియరీ ఎప్పటికీ థియరీగానే మిగిలిపోతుంటుంది. ఏం చేస్తాం… ఎవరికీ ఆసక్తి, తీరిక లేదు. ఇలా కంటిన్యూ అయిపోవాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories