బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కంటే చాలా రాజకీయ చతురత కలిగిన హరీష్ రావు, రెండో స్థానంతో సరిపెట్టుకుంటూ కేసీఆర్‌కి ఎందుకు ఇంత విధేయంగా ఉంటున్నారో చెప్పుకున్నాము.
అయితే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ‘కట్టప్ప’ వంటివారని, కుట్రలు చేసి తన తండ్రి చేత తననే బయటకు గెంటించేశారని, రేపు మీకూ నా గతే పడుతుందని కల్వకుంట్ల కవిత పదేపదే హెచ్చరిస్తున్నారు.
కాళేశ్వరంలో హరీష్ రావు భారీగా అవినీతికి పాల్పడి కేసీఆర్‌కి తీరని కళంకం తెచ్చారని ఆరోపిస్తూనే ఉన్నారు. అయినా కేసీఆర్ కూతురుని కాదని హరీష్ రావునే ఎందుకు నమ్ముకున్నారు?అని ఆయన కోణంలో కూడా ఆలోచిస్తే కొన్ని బలమైన కారణాలు కనిపిస్తాయి.
1. కేటీఆర్‌ని తన రాజకీయ వారసుడుగా హరీష్ రావు అంగీకరించడం. ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించకుండా విధేయంగా ఉండటం.
2. కేటీఆర్‌కి వాక్చాతుర్యం ఉంది కానీ సమస్యలు ఎదురైతే పరిష్కరించలేరు. పలు సందర్భాలలో ‘ట్రబుల్ షూటర్’గా పేరు పొందిన హరీష్ రావునే ఉపయోగించుకోవలసి వచ్చింది. కనుక తమకు అత్యంత విశ్వాసంగా, విధేయంగా ఉంటూ తెలివిగా సమస్యలు పరిష్కరించగల సమర్ధుడైన హరీష్ రావు కేటీఆర్‌కి అండగా ఉండటం అవసరమని కేసీఆర్ భావిస్తుండవచ్చు.
3. కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్న కూతురు కవితని బయటకు గెంటేస్తేనే ఆమె తండ్రి హయంలో జరిగిన అనేక అవినీతి భాగోతాలు బయటపెడుతున్నారు. అలాంటిది సాగునీటి శాఖ, ఆర్ధికశాఖల మంత్రిగా చేసిన హరీష్ రావు బయటకు పంపించేస్తే? ఆయన నోరు విప్పి మాట్లాడటం మొదలుపెడితే? ముఖ్యంగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్‌ల గురించి మాట్లాడితే? చాలా చాలా ప్రమాదం.
4. కనుక అయనని బయటకు గెంటేస్తే సృష్టించే ప్రమాదాల కంటే పార్టీలో ఉంచుకుంటే వచ్చే ప్రమాదాన్ని తట్టుకొని ఎదుర్కోవడమే సులువని కేసీఆర్ భావిస్తుండటం వల్ల కావచ్చు.
5. మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కి రాష్ట్ర భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక సామాజిక పరిస్థితుల గురించి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ఎంత అవగాహన, పట్టు ఉన్నాయో, పార్టీలో ఒక్క హరీష్ రావుకి మాత్రమే అంత అవగాహన, పట్టు ఉన్నాయనేది అందరూ అంగీకరిస్తారు. ఓ రాజకీయ పార్టీ బలంగా నిలబడాలంటే అన్ని అంశాలపై పూర్తి పట్టున్న నాయకుడు చాలా అవసరం. హరీష్ రావుని కేసీఆర్ వదులుకోకపోవడానికి ఇదీ ఓ బలమైన కారణంగా చెప్పవచ్చు.
6. పార్టీ కోసం 20 ఏళ్ళు కష్టపడి పనిచేసిన కూతురు కవితనే నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకొని గెంటేసిన కేసీఆర్, ఒకవేళ హరీష్ రావులో ఎప్పుడైనా తేడా కనిపిస్తే గెంటేయకుండా ఉంటారా? అంటే ఉండరనే చెప్పవచ్చు. అలాంటి పరిస్థితి రాలేదు… వస్తే హరీష్ రావుకీ అదే గతి పట్టించగలరు. గతంలో మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన స్థానం ఏమిటో అర్ధమయ్యేలా చేశారు. అప్పటి నుంచి హరీష్ రావు మరింత విధేయంగా ఉంటున్నారు. కనుక హరీష్ రావుని కేసీఆర్ పక్కన ఉంచుకుంటున్నారని చెప్పవచ్చు.






