ఈరోజు రాత్రి 9 గంటలకు స్పెషల్ షోతో హరిహర వీరమల్లు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కనుక థియేటర్ల వద్ద అప్పుడే అభిమానుల హడావుడి మొదలైపోయింది. ఇదేమీ పెద్ద విచిత్రం కాదు.
సాక్షి మీడియాలో హరిహర వీరమల్లుని బాయ్ కాట్ చేస్తున్నట్లు వార్త రావడం కూడా పెద్ద విచిత్రం కాదు.
కానీ బీఆర్ఎస్ పార్టీ సొంత పత్రిక ‘నమస్తే తెలంగాణ’లో పవన్ కళ్యాణ్- నారా లోకేష్ గురించి పాజిటివ్ న్యూస్ రావడమే చాలా చాలా విచిత్రం.
నిన్న మొన్నటి వరకు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేసిన రాజకీయాలు అందరూ చూశారు.
కానీ ఇప్పుడు హటాత్తుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరినీ పొగుడుతూ ‘నమస్తే తెలంగాణ’లో పాజిటివ్ న్యూస్ వ్రాయడం విచిత్రమే కదా?
“అన్నా… పవనన్న…’ అంటూ ప్రేమగా పిలుస్తూ ఆయనతో తన బంధాన్ని మరింత బలపరుస్తున్నారు. తెర వెనుక రాజకీయ లెక్కలేమైన ఉన్నా, బయటకు మాత్రం వీరిద్దరి మధ్య నెలకొన్న అనుబంధం అభిమానుల మధ్య సంతోషాన్ని కలిగిస్తోంది.
హరిహర వీరమల్లు రేపు విడుదల అవుతున్న నేపథ్యంలో సినీ రంగం నుంచి మొదలుకుని రాజకీయ నాయకుల వరకూ పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ నేత అంబటి రాంబాబు సైతం ట్వీట్ చేస్తూ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఇక కొద్ది సేపటి క్రితం మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది,” అని వ్రాసింది.
టీడీపిని ఎప్పుడూ విమర్శించడమే తప్ప మెచ్చుకోవడం ఎరుగని బీఆర్ఎస్ పార్టీలో ఈ మార్పు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మంత్రి నారా లోకేష్‌ని హైదరాబాద్‌లో రహస్యంగా కలిశారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించినప్పుడు, “నేను కలవలేదు. ఏం కలిస్తే తప్పా? నారా లోకేష్ నాకు తమ్ముడు లాంటివాడు. మా మద్య మంచి స్నేహం ఉంది. పొరుగు రాష్ట్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. నారా లోకేష్‌ని కలిస్తే తప్పేమిటి?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
అంటే టీడీపి విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఏదో మార్పు మొదలైందని అర్ధమవుతూనే ఉంది. ఆ మార్పే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో కూడా ప్రతిభింబించినట్లుంది.
హరిహర వీరమల్లు సినిమా స్పెషల్ వేసుకునేందుకు, టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించడంపై బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి విమర్శలు చేయకపోవడానికి కారణం కూడా ఆ మార్పేనేమో?
బీజేపిలో విలీనమవ్వాలనుకున్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీడీపితో పొత్తుకి సిద్దపడుతోందా?లేదా మరేదైనా కారణం ఉందా?




