తెలంగాణ పేరు తో రాజకీయం…కనుమరుగు తప్పదా.?

Telangana Regional Parties

తెలంగాణ పేరు మీద రాజకీయం చేసేందుకు ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలు తెలంగాణలో పురుడు పోసుకున్నాయి, అలాగే అనేకానేక కారణాలతో రాజీ పడుతూ చివరికి విలీనం తోనో, పేరు మార్పుతోనో తనువు చాలిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలు ఒక్కసారి ఇక్కడ చూద్దాం.

ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యం అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలలో ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఏర్పాటుతో తన తనువు చాలించింది. కేసీఆర్ తెరాస దశాబ్దాలుగా తెలంగాణ పేరు మీదే రాజకీయం చేసింది, చివరికి అదే తెలంగాణ లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ కాస్త భారతీయ రాష్ట్ర సమితిగా రూపం మార్చుకుని కొత్త రాజకీయం మొదలుపెట్టింది.

ADVERTISEMENT

ప్రాంతీయ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు అనే ఒకేఒక్క ఆశ కేసీఆర్ ని తెరాస విషయంలో రాజీ పడేలా చేసింది. పార్టీ పేరు మార్పు నిర్ణయం తెరాస ను బిఆర్ఎస్ గా మార్చడమే కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని తెలంగాణ ప్రతిపక్ష నేతగా కూడా మార్చగలిగింది. తెరాస తో తెలంగాణ పేరు మీద రాజకీయ నడిపిన కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండుగా చీల్చితే చివరికి అదే తెరాస తో కవిత కల్వకుంట్ల కుటుంబ రాజకీయాన్ని రెండుగా చీల్చింది.

ఇక ‘తల్లి తెలంగాణ’ అంటూ తెలంగాణ ఏర్పాటు కోసం సై అన్న నటి విజయశాంతి పార్టీ కేసీఆర్ తెరాస లో విలీనం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ పేరు మీద రాజకీయం చెయ్యాలని భావించిన విజయశాంతి చివరికి అదే తెలంగాణలో రాజకీయ ఉనికి కోసం పోరాడుతుంది. తల్లి తెలంగాణ నుంచి తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలో తన అదృష్టాన్ని పరిక్షించుకున్న విజయశాంతి నేటికీ తెలంగాణలో యాక్టీవ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నారు.

అలాగే రాష్ట్ర విభజన కు మద్దతుగా 2008 లో టీడీపీ ని వీడి ‘నవ తెలంగాణ’ అంటూ తెలంగాణ పేరు మీద రాజకీయ పార్టీ స్థాపించారు దేవేందర్ గౌడ్. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో టీడీపీ కీలక నేతగా ఉన్న ఈ దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ తో తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా కనుమరుగైపోయారు.

ఇక 2021 న వైఎస్ షర్మిల ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ పేరుతో తెలంగాణ లో రాజకీయం మొదలుపెట్టారు. తన అన్న జగన్ తో వచ్చిన విభేదాల కారణంగా ఏపీని వదిలి తెలంగాణకు షిఫ్ట్ అయిన షర్మిల తెలంగాణ లో రాజన్న రాజ్యం అంటూ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేసారు. చివరికి తన టి. వైసీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి తిరిగి ఏపీ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇలా తెలంగాణ రాజకీయ గత చరిత్ర చూస్తే ‘తెలంగాణ’ అనే పేరు మీద రాజకీయం చెయ్యాలని చూసిన నేతలు, ఆయా పార్టీలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను పొందినప్పటికీ చివరికి అదే తెలంగాణ రాజకీయాల నుండి కనుమరుగవుతున్నారు, పార్టీలను విలీనాలతో, పేరు మార్పులతో కడతేరుస్తున్నారు.

అయితే తాజాగా కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ అంటూ అదే తెలంగాణ పేరు మీద రాజకీయం చేసేందుకు బరిలోకి దూకారు. అయితే కేసీఆర్ తెరాస బిఆర్ఎస్ గా మారిపోవడంతో తెరాస తెలంగాణ రాజకీయ కాలగర్భంలో కలిసిపోయింది.

అయితే కవిత తన కొత్త పార్టీకి పాత పేరు పెట్టుకుని తెరాస అంటూ ముగిసిన తెలంగాణ ప్రాంతీయవాదాన్ని మరోసారి తెరమీదకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. తెరాస పార్టీ తో తెలంగాణ ప్రాంతీయవాదాన్ని సజీవంగా ఉంచేందుకు కవిత తెలంగాణ అనే పదాన్ని తన రాజకీయంలో ఒక భాగంగా మార్చుకున్నారు.

అయితే ఇప్పటికే ఆ పేరు మీద రాజకీయం నడిపిన నేతలు, ఆ పేరు మీద ఏర్పడిన రాజకీయ పార్టీలు అన్ని కూడా తెలంగాణ రాజకీయాలలో కనుమరుగయిపోయాయి. విజయశాంతి తల్లి తెలంగాణ కేసీఆర్ తెరాస లో విలీనం కాగా కేసీఆర్ తెరాస బిఆర్ఎస్ గా రూపాంతరం చెందింది.

ఇక దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందే సమాదైపోయింది. అలాగే వైఎస్ షర్మిల టి. వైసీపీ కూడా కాంగ్రెస్ లో విలీనంతో తనువు చాలించింది. ఇక తల్లి తెలంగాణ అన్న విజయశాంతి సోనియా తల్లి దగ్గర కు చేరితే, నవ తెలంగాణ అన్న దేవేందర్ గౌడ్ రాజకీయాల నుంచి నిష్క్రమించారు. అలాగే తెలంగాణలో రాజన్న రాజ్యం అన్న షర్మిల రాహుల్ రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్నారు.

తెరాస తో తెలంగాణ జాతిపిత అంటూ ప్రశంసలు పొందిన కేసీఆర్ చివరికి ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. మరి ఇప్పుడు తెరాస అంటూ కవిత తెలంగాణ పేరు మీద మొదలు పెట్టిన రాజకీయం ఏదోనాటికి విలీనంతోనో, పేరు మార్పుతోనో సరిపెట్టుకుంటుందా.? అలాగే విజయశాంతి, దేవేందర్ గౌడ్, షర్మిల మాదిరి నాలుగు రోజుల హడావుడితో సర్దుకుంటుందా.?

ADVERTISEMENT
Latest Stories