మద్రాస్ నుంచి హైదరాబాద్ తరలివచ్చిన తెలుగు సినీ పరిశ్రమ, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి తరలి రావాలనే ఆలోచన చేసింది. కానీ ఉద్యమ సమయంలో సినీ పరిశ్రమని ద్వేషించిన కేసీఆర్, ముఖ్యమంత్రి కాగానే అదొక బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతని గ్రహించి అక్కున చేర్చుకున్నారు. కనుక అది కూడా ఏపీకి తరలి వెళ్ళాలనే ఆలోచనలను విరమించుకుంది.
ఆ తర్వాత వైసీపీ హయంలో ఎదురైన చేదు అనుభవాల కారణంగా ఇప్పుడు సాక్షాత్ సిఎం చంద్రబాబు నాయుడు, సినీ పరిశ్రమ నుంచి వచ్చన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పిలుస్తున్నా ఏపీకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ పట్ల బాగానే ఉంటోంది. కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమని బాగానే చూసుకుంటున్నాయి. వాటితో ఏవిధంగా మేసులుకోవాలో సినీ పరిశ్రమ కూడా బాగా నేర్చుకుంది. ఇందుకు తాజా ఉదాహరణగా తెలుగు సినీ పరిశ్రమ నేడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్, యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో సన్మానం చేస్తుండటాన్ని చూడవచ్చు.
కనుక తెలంగాణలో ప్రభుత్వాలు మారినా సినీ పరిశ్రమకు త్వరాగానే వాటితో అడ్జస్ట్ అయిపోగలదు. అన్ని విధాలుగా అభివృద్ది చెందిన హైదరాబాద్‌లోనే సినీ పరిశ్రమకు బాగుంది. కనుక అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దాంతో సక్యతగా మెలుగుతూ సినీ పరిశ్రమ ప్రశాంతంగా గడిపేస్తోంది. కనుక ఇక తెలుగు సినీ పరిశ్రమకి ఏపీకి వచ్చే ఆలోచన, అవసరం ఉండకపోవచ్చు.
తెలంగాణవాదం చాలా బలంగా ఉన్న ఆ రాష్ట్రంలోనే రెండు భిన్నమైన పార్టీలు తెలుగు సినీ పరిశ్రమని ఆదరించి చేజారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. కానీ ఏపీలో పార్టీలు ఆవిధంగా ఎందుకు చేయలేకపోయాయి? అంటే సినీ పరిశ్రమలో వారికి రాజకీయ సంబంధాలు ఉండటం… అవి ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తుండటమేనని అనుకోవాలేమో?




