నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు కాగానే ఆ సామాజిక వర్గానికి కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులతో ఒక సమావేశం పెట్టించి రఘురామ కృష్ణం రాజుకు తమ సామాజిక వర్గం సపోర్టు లేదని… ముఖ్యమంత్రిని తిట్టడం తప్పని సుద్దులు చెప్పించారు. క్షత్రియులు మావైపే అంటూ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకున్నారు.
అయితే రఘురామ కృష్ణం రాజు కు బెయిల్ వచ్చిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడక్కడా ఆయనకు అనుకూలంగా ఆ సామాజిక వర్గం వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడిక్కడ పోలీసులు ఫ్లెక్సీలను పెట్టిన వారిని పిలిపించి వారితోనే వాటిని తొలగింపజేశారు. దీనితో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
పైగా కొన్ని నియోజకవర్గాలలో రఘురామ కృష్ణం రాజు అనుకూల వర్గీయులు అనే వారికి పోలీసులు మౌఖిక వార్నింగ్లు కూడా ఇస్తున్నారట. ఆయన జైలు నుండి విడుదలైన సమయంలో ఏవైనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అనవసరంగా ఇబ్బంది పడతారని వార్నింగ్ ఇస్తున్నారట.
“ప్రభుత్వం క్షత్రీయులంతా మా వైపే ఉన్నారు. రఘురామ కృష్ణం రాజుకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు అని అధికార పార్టీ పదే పదే చెబుతుంది. మరి 151 ఎమ్మెల్యేల తో గెలిచాం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం సాధారణ ఫ్లెక్సీలను చూసి కూడా ఎందుకు భయపడుతుంది?,” అని ఎంపీవర్గం వారు ప్రశ్నిస్తున్నారు.



