కేసీఆర్ దేవుడు అంటూనే తండ్రిపై కల్వకుంట్ల కవిత తిరుగుబాటు చేస్తున్నారు. నేను అడుగుతున్న ప్రశ్నలకు ఆ దేవుడు కూడా ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని ఆ భక్తురాలు నిలదీస్తున్నా స్పందించడం లేదు.
“కేసీఆర్ దేవుడు అంటున్నారు కదా.. ఆ దేవుడుకి అన్నీ తెలుసు కదా?కనుక ఆ దేవుడిపై భారం వేసి ఆయన స్పందించే వరకు వేచి చూడాలి కదా? కానీ ఇప్పుడే తాడో పేడో తేల్చేయాలంటే ఎలా?పార్టీకి, ఆ దేవుడి ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం సరికాదు,” అంటూ బిఆర్ఎస్ సీనియర్ నేత తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అప్పుడే కవితమ్మకి తొలి కౌంటర్ వేశారు.
ఇది ఆరంభమే మున్ముందు ఆమెపై బిఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడులు చేసినా ఆశ్చర్యం లేదు.
కల్వకుంట్ల కుటుంబాన్ని, బిఆర్ఎస్ పార్టీని కవితే చీల్చి చెండాడేస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. బహుశః అందుకేనేమో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళిపోయారేమో?
కూతురు కత్తులు దూస్తుంటే కొడుకు విదేశాలలో చిల్ అవుతున్నారు. పోనీ ‘ట్రబుల్ షూటర్’ హరీష్ రావు పక్కన ఉన్నాడు కదా అనుకుంటే ఆయనే ‘ట్రబుల్ మేకర్’, ‘బీజేపి కోవర్ట్’ అన్నట్లు కూతురు కవిత ఆరోపణలు కేసీఆర్‌ని ఆలోచింపజేయకుండా ఉండవు.
ఇంట్లో ఈగల మోత ఇలా ఉంటే బయట కూడా అలాగే ఉంది. కాళేశ్వరం అవకతవకలపై జూన్ 5న కమీషన్ ఎదుట కేసీఆర్ హాజరవ్వాలి. ఆ కేసు విచారణ కొలిక్కి వచ్చింది కనుక అది కూడా కేసీఆర్ పీకకి చుట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ కష్టాలు సరిపోవన్నట్లు సరిగ్గా ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌లో దిగబోతున్నారు.
మూడు రోజులలోగా అమెరికా నుంచి వచ్చి సిట్ విచారణకు హాజరు కావాలని, వారికి అన్ని విదాల ‘సహకరించాలని’ సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతవరకు ఆయనని అరెస్ట్ చేయవద్దని సిట్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
కనుక ఆయన హైదరాబాద్ రావడం ఖాయం.. ఈ కేసు గురించి నోరు విప్పడం ఖాయం.. విప్పితే ఈ కేసు కూడా కేసీఆర్ మెడకు చుట్టుకోవడం ఖాయమే.
దేవుడు.. దేశ్ కీ నేత కేసీఆర్‌కి ఒకేసారి ఇన్ని కష్టాలు చుట్టు ముట్టడం, ఈ ఆపత్సమయంలో కుటుంబ సభ్యులలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీని పరిస్థితి నెలకొని ఉండటం, ఇంత జరుగుతున్నా ఆ దేవుడు ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకుండా మౌనంగా ఉండిపోవడం బిఆర్ఎస్ పార్టీలో ఆయననే నమ్ముకున్న వారందరికీ ఆందోళన కలిగించే విషయమే.
కేసీఆర్ 100 శాతం వాస్తు పాటించినా, సుదర్శన యాగాలు చేసినా, తెలంగాణ అభివృద్ధి చేసినా ఎందుకిలా జరుగుతోంది?ఎవరికైనా కష్టాలు వస్తే ఆ దేవుడికి చెప్పుకుంటారు. కానీ ఆ దేవుడికే కష్టాలు వస్తే?బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో కలిపేయడమే ఏకైక పరిష్కారమా?ఏమో ఆ దేవుడే చెప్పాలి.




