కేటీఆర్ తన విమర్శలతో రేవంత్ కూటమిలో చిచ్చురేపనున్నారా.? అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ తన సొంత పార్టీ మంత్రుల ఫోన్లను టాపింగ్ చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ కుటుంబంలో అనుమానం అనే విత్తనాన్ని నాటుతున్నారా.?
గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ప్రభుత్వ పెద్దలు అధికార పెద్దల సాయంతో సొంత పార్టీ ఎమ్మెల్యే ల నుంచి ప్రత్యర్థి పార్టీ నేతల వరకు ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డారు అంటూ ఈటెల నుంచి రేవంత్ వరకు కేసీఆర్ సర్కార్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇక ఇప్పుడు విమర్శించే అవకాశం బిఆర్ఎస్ కు చిక్కితే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ ను వరించాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో పదవులకన్నా నాయకులే ఎక్కువని, అందువల్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, బహిర్గత విమర్శలు సర్వ సాధారణం అంటూ ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తాయి.
అందులో భాగంగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్ల పాటు సజావుగా ప్రభుత్వాన్ని నడపలేదని, రేవంత్ కూటమి మూడునాళ్ళ ముచ్చటే అవుతుంది అంటూ బిఆర్ఎస్ రేవంత్ నాయకత్వం టార్గెట్ గా విమర్శలకు దిగింది.
అయితే బిఆర్ఎస్ విమర్శలను, ఆ పార్టీ నేతల ఆశలను రేవంత్ సర్కార్ కలిసికట్టుగా ఎదుర్కొంటు బిఆర్ఎస్ విమర్శలకు గట్టి బదులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ పై కేటీఆర్ చేసిన మంత్రుల ఫోన్ టాపింగ్ ఆరోపణలను మూకుమ్మడిగా తిప్పికొట్టారు కాంగ్రెస్ మంత్రులు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఫోన్లను ముఖ్యమంత్రి రేవంత్ టాప్ చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదా.? ఆయా కాంగ్రెస్ నేతల ఫోన్లు టాప్ కావడం లేదని నీ మనవడు పై ఒట్టేసి చెప్పగలవా.? లేక లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా.? అంటూ కేటీఆర్ రేవంత్ టార్గెట్ గా సవాల్ విసిరారు.
అయితే కేటీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ మంత్రులు స్పందిస్తూ తమ ప్రభుత్వం మీ ప్రభుత్వం మాదిరి ఎవరి ఫోన్లను టాప్ చెయ్యలేదని, సీఎం పై ఇటువంటి నిరాధార ఆరోపణలు చెయ్యడం, అసభ్యకర పదజాలంతో దూషించడం కేటీఆర్ కు తగదు అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
సీఎం పదవి కోసం తాము ఆశపడడం లేదని, అలాగే రేవంత్ మీద ఈ తరహా విమర్శలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చలేరంటూ ఈ ముగ్గురు మంత్రులు రేవంత్ కు మద్దతు పలుకుతూ రేవంత్ సర్కార్ పటిష్ఠతకు మరో ముడి వేశారు. దీనితో కేటీఆర్ నాటిన అనుమానం అనే విత్తనం రానున్న రోజులలో మొలకెత్తుతుందా.? లేక ఎండిపోనుందా.? అనేది చూడాలి.




