నాచురల్ స్టార్ గా మారిన తర్వాత నాని నిజంగా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయినట్లున్నారు. వరుస సక్సెస్ లు అందుకుంటూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన నాని, ఎవ్వరూ అందుకోలేని రికార్డును “నేను లోకల్” ద్వారా అందుకున్నాడా? అంటే పూర్తి సమాచారం రావడానికి మరో రెండు రోజుల సమయం పడుతుంది గానీ, బాక్సాఫీస్ వద్ద వెలువడుతున్న సంకేతాలు అయితే, నాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లే అన్న భావన సినీ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతోంది.
అందుకు సాక్ష్యమే… ‘నేను లోకల్’ సాధించిన ఓపెనింగ్స్. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా రికార్డులు సాధించిన ‘నేను లోకల్’లో, మహేష్, పవన్ ల మాదిరి నాని కూడా ‘వన్ మ్యాన్ షో’తో సినిమాను తన భుజాలపై వేసుకుని, బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారని సినీ విశ్లేషకులు వ్యక్తపరిచిన అభిప్రాయం. ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న ఏ హీరో కూడా అందుకోలేని ‘డబుల్ హ్యాట్రిక్’ను, ఒక సాధారణ వ్యక్తిగా వచ్చిన నాని అందుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం.
2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలైన నాని విజయ ప్రస్థానంలో ‘భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాధ’ చిత్రాలతో తొలి హ్యాట్రిక్ ను అందుకోగా, అందుకు కొనసాగింపుగా ‘జెంటిల్మెన్, మజ్ను’ చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టి, తాజాగా ‘నేను లోకల్’తో దానిని అందుకున్నాడని చిత్ర ఓపెనింగ్స్ చెప్తున్నాయి. ఇదంతా కూడా కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో సాధించడం మరో గొప్ప విషయం. ఒక్క 2016లోనే మూడు సినిమా విజయాలను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. వారసులు మాత్రమే రాజ్యమేలుతున్నారని భావించే సినీ ఇండస్ట్రీలో, ‘నాచురల్ స్టార్’ నాని విజయపరంపర నిర్విరామంగా ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.



