kishan-reddy

తెలంగాణ రాజకీయాలలో ఎదగాలి, అధికార పీఠం అందుకోవాలి అనుకున్న బీజేపీ ఆశలు ఎప్పటికప్పుడు ఏదోక రూపంలో నీరుగారి పోతూనే ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ కాస్త బలపడుతుంది, దాని బలం చూపిస్తుంది అనుకున్న ప్రతిసారి బీజేపీ కొన్నాళ్ళు మౌన ముద్రలోకి వెళ్ళిపోతుంది.

టి.బీజేపీ లో నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యకుడిగా ఉన్న సమయంలో అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీ మీద దూకుడుగా ముందుకెళ్ళేది బీజేపీ. అలాగే అటు కాంగ్రెస్ పార్టీని కూడా తన విమర్శలతో ఇరుకున పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి నెట్టేసింది బీజేపీ.

Also Read – విశ్వంభర VFX ఎక్కడ తేడా కొట్టింది?

కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. అటు అధికార పార్టీ దూకుడుగా ముందుకెళుతున్నా, ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ మౌనంగా కూర్చున్నా బీజేపీ మాత్రం ఎక్కడా చడీ చప్పుడు లేకుండా స్తబ్దుగా ఉండిపోయింది. అలాగే బిఆర్ఎస్ నేతలంతా ఒక్కొక్కరుగా కేసీఆర్ కారు దిగి కాంగ్రెస్ గూటికి వెళుతున్నారు కానీ కాషాయం కండువా కప్పుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.

అలాగే అటు హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలతో ప్రజల వ్యతిరేకతను మూటకట్టుకుంటుంది. అలాగే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు రాకుండా తన శేష జీవితం అక్కడే కొనసాగిస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రజలకు సాయంగా బీజేపీ దూకుడుగా ముందుకొచ్చి ప్రజల తరుపున ప్రభుత్వం మీద పోరాడాల్సి ఉన్నా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లే సరైన నాయకుడు బీజేపీకి లేకపోవడం బీజేపీ లెక్క తప్పుతుంది.

Also Read – వైసీపి, టిడిపి… దేని ఉచ్చులో ఏది?

అటు ఏపీలో కూడా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన సోము వీర్రరాజు కూడా పార్టీ బలోపేతానికి కాకుండా స్వప్రయోజనాల కోసం పని చేయడంతో ఏపీలో బీజేపీ జాడే కనుమరుగయిపోయింది. దీనితో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సోముని తప్పించి దగ్గుపాటి పురందరేశ్వరి అప్పగించింది బీజేపీ అధిష్టానం.

అలాగే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి పార్టీ బలోపేతం మీద కాస్త ద్రుష్టి పెట్టినట్లయితే తెలంగాణలో బీజేపీ చాల ముఖ్య భూమిక పోషించి ఉండేది. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుని తిరిగి అవకాశం కోసం ఎదురు చూడడం, తెలంగాణ బీజేపీకి అలవాటుగా మారిపోతుంది.

Also Read – గేమ్ ఛేంజర్‌… నిజమే!


హైడ్రా బాధితుల ఆర్తనాదాలతో షెడ్ కు వెళ్లిన బిఆర్ఎస్ కారు రోడ్డు మీదకు రావడానికి సిద్దమయ్యింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నిక ప్రచారంలో ప్రజలకిచ్చిన హామీల అమలుకు నిధుల కొరతతో జాప్యం జరుపుతున్న సందర్భంలో తెలంగాణలో రేవంత్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మొదలయిందంటూ విశ్లేషణలు వినపడుతున్నాయి. అయినా బీజేపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తెలంగాణ రాజకీయాల లెక్క మార్చలేకపోతుంది.