రాఘవేంద్రరావు ఇంటి వద్ద దాడిలో అసలేం జరిగింది?

 Writer Attacks  director K Raghavendra Raoటాలీవుడ్ దశాదిశలను నిర్దేశించిన దర్శకుడు రాఘవేంద్రరావు. ఒక మూస పద్ధతిలో వెళ్తున్న తెలుగు సినీ గమనాన్ని మార్చిన దర్శకుడిగా దర్శకేంద్రుడుకు ఉన్న ఖ్యాతి తెలియనిది కాదు. అయితే అలాంటి దిగ్గజంపైనే దాడికి దిగాడు ఓ యువకుడు. అది కూడా రాఘవేంద్రరావు నివాసం ఉంటున్న సొంత ఇంటి ప్రాంగణంలోనే కావడం మరింత విస్తుగొలిపే అంశం. అయితే ఇంతకీ అసలు రాఘవేంద్రరావు ఇంటి వద్ద ఏం జరిగింది? అన్న విషయానికి వస్తే…

ADVERTISEMENT

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ సైట్-2లో నివసిస్తున్న రాఘవేంద్రరావు ఇంటి నుంచి బయటకు వెళుతున్న సమయంలో… కారును అడ్డుకున్న అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం, ఉద్దులవాడకు చెందిన వల్లిపి రవీంద్ర అనే యువకుడు నానా బీభత్సం సృష్టించాడు. 2006లో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘శ్రీరామదాసు’ చిత్ర మూలకథ తనదేనని చెప్పుకున్న సదరు యువకుడు… ఇప్పటిదాకా దానికి సంబంధించి తనకు ఎలాంటి పారితోషికం అందలేదని తెలిపాడు. అంతేకాక కథ తనదైతే… టైటిల్స్ లో కథా రచయితగా భారవి పేరు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రాఘవేంద్రరావు కారును నిలిపేసిన సదరు యువకుడు, ఏకంగా దర్శకేంద్రుడుపైనే తిట్ల దండకం అందుకున్నాడు. అలాగే అడ్డుకునేందుకు యత్నించిన వాచ్ మన్ ను పక్కకు తోసేసిన రవీంద్ర… రాఘవేంద్రరావును కారు నుంచి బయటకు లాగేందుకు యత్నించాడని తెలుస్తోంది. అయితే ఎలాగోలా రవీంద్ర దాడి నుండి రాఘవేంద్రరావు కారు బయటకు వెళ్లిపోయింది. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన రవీంద్ర ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవనంలోని ఓ ఇనుప రాడ్ ను తీసుకుని రాఘవేంద్రరావు ఇంటిలోకి ప్రవేశించాడు.

అడ్డుకున్న వాచ్ మన్ పై దాడి చేసి లోపలికి ప్రవేశించిన రవీంద్ర.., అక్కడ ఉన్న ఆడి, బెంజి, శాంట్రో కార్లపై విరుచుకుపడ్డాడు. ఇనుప రాడ్ తో దాడి చేయడంతో ఆ కార్ల అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. ఆ శబ్దం విని బయటకు వచ్చిన రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ రావుపైనా కూడా దాడికి యత్నించాడు. ఈ క్రమంలో వాచ్ మన్ సహకారంతో రవీంద్రను పట్టుకున్న ప్రకాశ్ రావు అతడిని సెక్యూరిటీ గదిలో బంధించి, పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా బుధవారమే రాఘవేంద్రరావు ఇంటి పరిసరాల్లోకి వచ్చిన రవీంద్ర రెక్కీ నిర్వహించాడని తెలిసింది. అంతేకాక బుధవారమే దాడికి యత్నించగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరుసటి రోజు అంటే గురువారం నాడు దాడికి ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగారని తెలిసి వచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ‘కధల వ్యధల’కు కొదవలేదు. చాలా సినిమాలలో కూడా ఇలాంటి సన్నివేశాలను చూపించారు. అలాగే మరికొందరు పబ్లిసిటీ కోసం కూడా ఇలాంటి ‘స్టంట్’లు చేస్తుంటారు. దీంతో సదరు యువకుడు చెప్తున్నట్లుగా ‘శ్రీరామదాసు’ కధ విషయంలో దాగి ఉన్న నిజాన్ని పోలీసులే నిగ్గుతేల్చాలి.

ADVERTISEMENT
Latest Stories