రాజకీయాలలో హామీలు ఇవ్వడం సులభం. కానీ వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం మాత్రం అంత సులభం కాదు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాల అభివృద్ధి పై నేతలు ఎన్నో హామీలు ఇస్తుంటారు. అయితే గెలిచినా తరువాత తమ నియోజకవర్గంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు.? ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అన్నదే కీలకం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం, మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం మీద సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమ తమ సొంత నియోజకవర్గం అభివృద్ధి పై పెట్టిన దృష్టి ఇతర నాయకులకు ఆదర్శంగా నిలుస్తుంది.
ముందు సీఎం నారా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం….
దశాబ్దాలుగా కుప్పం ఎదుర్కుంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా బాబు అడుగులు వేశారు. ఇందుకు గాను హంద్రీనీవా – సుజలస్రవంతి ప్రాజెక్ట్ ద్వారా కుప్పం ప్రజల సాగు, తాగు నీటి సమస్యకు చెక్ పెట్టారు. 2025 లో కూపం నియోజకవర్గంలో 1292 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన బాబు హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కుప్పం లోని చివరి ఎకరాకు కూడా నీరు అందిస్తామని ఇచ్చిన హామీని నేడు కుప్పంకి కృష్ణ జలాల విడుదలతో బాబు నిలబెట్టుకున్నారు.
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం…
పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లు, తాగు నీరు, పారిశుద్యం, విద్యా వైద్యం, సాగు నీరు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు పెద్ద పీట వేశారు. 2026 లో పిఠాపురం అభివృద్ధి పనుల పై జరిపిన సమీక్షలో భాగంగా పంచాయితీ రాజ్ శాఖ పరిధిలోని 285 సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసారు.
అలాగే 52 ఆవాసాలకు తాగు నీరు అందించే నాగులపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల కల్పనా వంటి అనేక ఎన్నికల హామీలను నిలబెట్టుకున్నారు. ఇక తాజాగా పిఠాపురం పర్యటనకు వెళ్లిన పవన్ 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. అందులో భాగంగా గత కొన్నేళ్లుగా డంపింగ్ యార్డ్ గా ఉన్న విశాలమైన స్థలాన్ని అత్యాధునిక హంగులతో, వసతులతో పీఠికాపురవనం గా మార్చారు.
మంత్రి నారా లోకేష్ నియోజకవర్గమైన మంగళగిరి….
మంగళగిరిలో ఓటమితో తన తొలి రాజకీయ అడుగు వేసిన లోకేష్ అదే మంగళగిరిని రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గాను 2026 జూన్ లో 142 కోట్లతో నిడమర్రు రైల్ ఓవర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన, అదే సమయంలో 1167 కోట్లతో మంగళగిరి – తాడేపల్లి భూగర్భ డైనైజ్ మొదటి దశ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.
ఎన్నో దశాబ్దాల కలగా మారిన నియోజవర్గ ప్రజలకు పట్టాభిషేకం అంటూ ఇళ్ల పట్టాలను అందించారు. ఇక నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. పార్కులు, పారిశుద్యం తో పాటుగా తన సొంత నిధులతో నిర్మించిన నిడమర్రు ప్రభుత్వ పాఠశాల మంగళగిరి బ్రాండ్ వాల్యూ ను రెట్టింపు చేసింది.
ఇలా ఈ ముగ్గురు నాయకులు కూటమి త్రిమూర్తుల మాదిరి తమ అధికారంతో, తమ పదవులతో తమ సొంత నియోజకవర్గాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ఏమేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనేది ఆయా నియోజవర్గాలలో మారిన పరిస్థితులే ప్రత్యక్ష సాక్షాలుగా మారనున్నాయి.





