వైసీపి అసమ్మతి నేతల కోసం వాటి ఆరాటం… నాట్ గుడ్!

YCP TDP Janasena

టిడిపి, జనసేనలు వైసీపిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మళ్ళీ ఆ పార్టీలో టికెట్స్ లభించని అసమ్మతి నేతల కోసం ఆరాటపడుతుండటం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అవుతోందని చెప్పక తప్పదు. మేము వద్దనుకున్నవారే టిడిపి, జనసేనలు తీసుకుంటున్నాయని వైసీపి నేతలు చెప్పుకొంటున్నారు కూడా.

ఎన్నికలలో గెలుపు గుర్రాల అన్వేషణలో అన్ని పార్టీలు ఈవిదంగా వ్యవహరించడం సాధారణ విషయమే. కానీ టిడిపి, జనసేన పార్టీలలోనే టికెట్స్ ఆశిస్తున్నవారే అనేకమంది ఉన్నపుడు వారిని కాదని, వైసీపి అసమ్మతి నేతలను పార్టీలోకి దిగుమతి చేసుకుని టికెట్లు ఇస్తే ఇంటికి నిప్పు పెట్టుకున్నట్లే అవుతుందని మరిచిపోకూడదు.

ADVERTISEMENT

కనుక టిడిపి, జనసేనలలో ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇన్నేళ్ళుగా శ్రమిస్తున్నవారికి ప్రాధాన్యం ఇస్తూ సీట్ల సర్దుబాట్లు చేసుకుని వారికి టికెట్స్ ఇచ్చుకోవడమే చాలా మంచిది. తద్వారా పార్టీలపై వారికి నమ్మకం పెరుగుతుంది. దాంతో రెండు పార్టీలు ఇంకా బలపడతాయి.

ఒకప్పుడు టిడిపిలో కార్యకర్తల స్థాయి నుంచి పనిచేసి పైకి ఎదిగినవారితో పార్టీ చాలా పటిష్టంగా ఉండేది. కానీ బయట నుంచి రెడీమేడ్ నేతలను తెచ్చుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచే పార్టీ పనితీరులో మార్పు మొదలైంది. బయట నుంచి వచ్చినవారే పార్టీని శాశించే స్థాయికి ఎదిగిపోవడంతో తప్పటడుగులు వేసి అధికారం కోల్పోవడం అందరూ చూశారు.

టిడిపి, జనసేనలు పార్టీలలో పనిచేస్తున్నవారిని కాదని వైసీపి నుంచి నేతలను దిగుమతి చేసుకొని వారికి టికెట్లు ఇస్తే రెండు పార్టీలలో చిచ్చు ఎలాగూ తప్పదు. పైగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపి నుంచి వచ్చినవారు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిపోతే నష్టపోయేది టిడిపి, జనసేనలే కదా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఇలాగే దారుణంగా దెబ్బతింది. బిఆర్ఎస్ పార్టీలో టికెట్స్ ఇవ్వలేనివారిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి గెలిచిన తర్వాత వారిని మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి తెచ్చేసుకొంటూ కేసీఆర్‌ ఆడిన గేమ్స్ వలన కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత దెబ్బ తిని పదేళ్ళు అధికారానికి దూరంగా ఉండిపోవలసి వచ్చింది.

కనుక టిడిపి, జనసేనలు కూడా చేజేతులా అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిది. వైసీపిలో నుంచి వస్తున్నవారు నిజంగా చాలా బలమైన నేతలే. గెలుపు గుర్రాలే కావచ్చు. కానీ ఆ గుర్రాలు మనవి కానప్పుడు వాటితో ఎన్నికల రేసుకి వెళ్ళి విజయం సాధించాలనుకోవడం మంచి ఆలోచన కాదు కదా?

జనసేనకు బలమైన నేతలు లేరు కనుక వైసీపి నుంచి దిగుమతి చేసుకొని బలపడాలని ఆశపడటం తప్పు కాదు. కానీ నాలుగు దశాబ్ధాల చరిత్ర కలిగిన టిడిపిలో నాయకులకు కరువు లేదు కదా? చంకలో బిడ్డని పెట్టుకుని ఊరంతా వెతకడం దేనికి?ఆలోచిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories