కరోనా వైరస్ సహాయకచర్యల కోసం దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. కొందరు నిజంగా మంచి మనసుతో డొనేషన్స్ ఇస్తుంటే కొందరు పేరు కోసం పబ్లిసిటీ కోసం ఇస్తున్నారు. ఏ కారణంతో ఇచ్చినా చివరికి ఆ డబ్బు మంచి పని కోసమే కాబట్టి అందరూ హర్షించాల్సిందే. కొన్ని సందర్భాలలో విరాళాల విషయంలో పోటీ కూడా ఉండటం సహజం.
సరిగ్గా అటువంటి పరిణామం గురించి సోషల్ మీడియాలో సీరియస్ గా చర్చ జరుగుతుంది. కరోనా సహాయక చర్యల కోసం హెరిటేజ్ ఫుడ్స్ కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని వివిధ రాష్ట్రాల సీఎం సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.30లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.30లక్షలు, కర్ణాటక సీఎం సహాయనిధికి రూ.10లక్షలు, తమిళనాడు సీఎం సహాయ నిధికి రూ.10లక్షలు, దిల్లీ సీఎం సహాయ నిధికి రూ.10లక్షలు, మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ.10లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం ఇవ్వడంతో, ముఖ్యమంత్రి జగన్ సతీమణి, సాక్షి, భారతి సిమెంట్స్ అధినేత్రి భారతి ఏం విరాళం ఇస్తారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోటీ కోసమైనా ఇంకో కారణంతోనైనా భారతి కూడా పెద్ద మొత్తం డొనేట్ చేస్తే మంచిదే కదా!





