పోతిరెడ్డిపాడు వద్ద కొత్త ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ను విభజన చట్టాన్ని ఉల్లంఘించి చేపడుతుందని ఆరోపిస్తూ కృష్ణా బోర్డుకు కంప్లయింట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ కు చెక్ పెట్టడానికి అన్నట్టు జగన్ ప్రభుత్వం కూడా ఒక కంప్లయింట్ ఇచ్చింది.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు చట్టవిరుద్ధం , ఆంధ్ర ప్రయోజనాలకు భంగం, విభజన చట్టానికి ఇది విరుద్ధం అని గోదావరి బోర్డుకు కంప్లయింట్ చేసింది జగన్ ప్రభుత్వం. దానిని వెంటనే ఆపేయాలని కోరింది. అయితే ఈ విషయంలో జగన్ అభాసుపాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగించే కాళేశ్వరంను తానే చీఫ్ గెస్ట్ గా వెళ్లి ఎలా ప్రారంభించారు జగన్ గారు ? అనే ప్రశ్న కి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు శిలాఫలకంపై జగన్ పేరు ఇప్పటికీ ఉంది. ఇవి అన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాజకీయంగా ఇబ్బంది కలిగించేవే.
“అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ చంద్రబాబు శత్రువు అని జగన్ ఆయన పంచన చేరారు. చంద్రబాబుకు కంటగింపు కలిగించాలని రాసుకుపూసుకుని తిరిగారు. ఇప్పుడు అదే ఇబ్బందిగా పరిణమించింది. అయితే కేసీఆర్ చాలా తెలివైన వాడు. తన ప్రయోజనాలు, తన రాష్ట్ర ప్రయోజనాల తరువాతే అన్నీ.దానికి పర్యవసానమే ఇది,” అని విశ్లేషకులు అంటున్నారు.





