ప్రపంచమంతా కరోనా వైరస్ ఉపద్రవాన్ని ఎలా ఎదురుకోవాలని తలలు పట్టుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం రాజకీయాలు, ఎన్నికలే ఎక్కువ అయిపోయాయి. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలా ఎదురుదాడి చేశారో అంతా చూశారు.
చివరికి కులముద్ర కూడా వేసి ప్రభుత్వాన్ని సమర్ధించే ఉండవల్లి వంటి వారితో కూడా తప్పు అనిపించుకున్నారు. ఆ తరువాత కరోనా ఉదృతం కావడంతో రమేష్ కుమార్ చేసిందే కరెక్టు అయ్యింది. అయినా ఆయన మీద ఉన్న పగ చల్లారలేదు ఏపీ ప్రభుత్వానికి. ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
హైకోర్టు జడ్జి హోదా ఉన్న వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ ఫైలును సిద్ధం చేసినట్లు లీకులు వస్తున్నాయి. గవర్నర్ ఆమోదం కోసం జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫైలును పంపిందని సమాచారం.
ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే రమేష్ కుమార్‌ని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. జగన్ సర్కార్ చేస్తున్న ఈ చర్యలు రాజ్యాంగం విరుద్ధమని అని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిపై గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కరోనా విపత్తు సమయంలో మీడియా, ప్రజల దృష్టి అటు ఉంటే తన పని తాను చకచకా చేసుకోవచ్చని అనుకుంటున్నట్టు ఉంది ప్రభుత్వం. “కరోనా లేదు గిరోనా లేదు… మా రాజకీయాలు మాకు ముఖ్యం,” అన్నట్టు ఉంది ప్రభుత్వ వ్యవహారం అంటూ పలువురు విమర్శిస్తున్నారు.





