విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో ఇటీవలే జరిగిన ప్రమాదానికి ముమ్మాటికీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వెల్లడైందని వార్తలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోయినా ప్రమాదం జరిగిన తరువాత తీసుకోవాల్సిన చర్యలలో కంపెనీ పూర్తిగా విఫలమైందని విచారణలో తేలినట్టు సమాచారం.
ట్యాంకులో స్టైరిన్ పాలిమరైజేషన్ కాకుండా వినియోగించాల్సిన విరుగుడు రసాయనం పేరా టెరిటెరీ బుటాల్ కేథాల్(పీటీబీసీ) కంపెనీలో తగినంత లేకపోవడంతోనే గ్యాస్ లీకైందని పలు కమిటీల ప్రాథమిక విచారణలో తేలిందని ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఒకసారి ప్రమాదం జరిగాకా పీటీబీసీని కేంద్రం వేరే రాష్ట్రం నుండి ప్రత్యేక విమానంలో విశాఖకు తరలించాల్సి వచ్చింది.
అలాగే ప్రమాదం జరిగిన వెంటనే సైరెన్ కూడా మోగించలేదు. లాక్‌డౌన్‌తో విరుగుడు రసాయన పదార్థాల నిల్వలపై కంపెనీ యాజమాన్యం దృష్టి సారించలేకపోయిందని చెప్పుకొచ్చినట్టు సమాచారం. విరుగుడు పదార్థాలను తగినంతగా నిల్వ ఉంచుకోవాలనే యోచన చేయకపోవడం ఎల్‌జీ నిర్లక్ష్యమేనని తెలిసింది.
జగన్ ప్రభుత్వం ప్రమాదం జరిగిన నాటి నుండీ కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. సరైన ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యకపోవడం… అందులో కఠినమైన సెక్షన్లు పెట్టకపోవడం…. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చెయ్యకపోవడం వంటి వాటితో విమర్శలు తప్పులేదు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటారో లేదో చూడాలి.





