YS-Jagan-APSRTC-Employeesఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ పూర్తి భిన్నవైఖరులు అవలంభించిన సంగతి అందరికీ తెలిసిందే. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు 55 రోజులు ఏకధాటిగా సమ్మె చేసినా, ఆ సమయంలో సుమారు 30-40 మంది ఉద్యోగులు చనిపోయినా కేసీఆర్‌ ఏమాత్రం కనికరించలేదు. చివరికి వారు పూర్తిగా దాసోహం అయ్యాక, వారి ముఖ్య నేతలందరినీ పక్కన పడేసి, ఉద్యోగులను ప్రగతి భవన్‌కి పిలిచి భోజనం పెట్టి వారు అడిగిన దానికంటే ఒక రూపాయి ఎక్కువే ఇచ్చి వారి చేతనే తన ఫోటోలకు పాలాభిషేకాలు చేయించుకొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే వారి డిమాండ్‌ను పట్టించుకోలేదు. వారు కూడా మళ్ళీ అడిగే సాహసం చేయలేరు.

అదే.. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు అడగక ముందే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాము కూడా ప్రభుత్వోద్యోగులమయ్యామని ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు మురిసిపోయారు. జగన్ చిత్ర పటాలకి పోటీలు పడి పాలాభిషేకాలు చేశారు.

కానీ ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు ప్రభుత్వంలో విలీనం కాగానే తమ జీతాలు అమాంతం పెరిగిపోతాయని, సమస్యలన్నీ తీరిపోయి సకల సదుపాయాలు లభిస్తాయనే వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి.

11వ వేతన సవరణ ప్రకారం జనవరి నుంచి ప్రభుత్వోద్యోగులు పెరిగిన జీతాలు అందుకొంటున్నారు. కానీ ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులకు నేటికీ జీతాలు పెంచలేదు. ఆగస్ట్ 1వ తేదీన అందుకోబోయే జీతంలో కూడా పెంపు ఉండదని స్పష్టమైంది.

ఏమంటే ఆర్టీసీ నష్టాలలో ఉంది కనుక కొంతకాలం ఓపిక పట్టాలని హితవు పలుకుతున్నారు. ఆర్టీసీ ఎల్లప్పుడూ నష్టాలలోనే ఉంటుంది. కనుక నష్టాలను తగ్గించుకొనేందుకు డీజిల్ సెస్ పేరుతో మూడు నెలల్లో రెండుసార్లు, ఓ సారి టికెట్ ఛార్జీలు పెంచుకొంది.

ఇది వరకు ఆర్టీసీ ఆదాయం రోజుకి రూ.12 కోట్లు ఉంటే ఇప్పుడు రోజుకి రూ.17 కోట్లు వస్తోంది. అంటే నెలకు కనిష్టంగా రూ.150 కోట్లు అదనపు ఆదాయం వస్తోందన్నమాట. ఇక పండుగలకు, పబ్బాలకు వచ్చే ఆదాయం అదనం. అయినా తమకు జీతాలు పెంచడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతన సవరణ ఒక్కటే కాదు.. 2017 వేతన సవరణ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని, టైర్ రిట్రీడింగ్ ఉద్యోగులకు ఇస్తున్న ఇన్సెంటివ్ కూడా ప్రభుత్వం నిలిపివేసిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం విజయవాడలో ఈయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. యూనియన్ అధ్యక్షుడు వైవిరావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్ రావు మాట్లాడుతూ, వేతన సవరణ బకాయిల చెల్లింపు, దాని ప్రకారం జీతాల చెల్లింపు, వైద్య సౌకర్యాలు తదితర అంశాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని లేకుంటే సమ్మె ప్రారంభించాల్సి వస్తుందని హెచ్చరించారు. వీటిపై నేడు సచివాలయంలో ఆర్ధిక, రవాణా శాఖల మంత్రులతో సమావేశం జరుగనుంది.