ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ ను మంగళవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు సీఎం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తన కుడిచేతిని సమాధిపై ఉంచి తల వంచుకుని కొన్ని నిమిషాల పాటు కూర్చుండిపోయారు.
ఆ తరువాత అక్కడికి సమీపంలోనే ఉన్న చర్చిలో జరిగే ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. జగన్ పర్యటనకు ఒక రోజు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక జీఓ విడుదల చేసింది. కడపలోని ఇడుపులపాయ లో వైఎస్సార్ స్మారక కేంద్రంలో అభివృద్ధి పనులు కోసం రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల ఏడు లక్షల రూపాయిలు కేటాయించింది.
అదే విధంగా కడప జిల్లాలో వివిధ పనుల కోసం 1500 కోట్ల నిధులు విడుదల చేశారు. మొత్తం మీద తన సొంత జిల్లాలో 5 వేల కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు సమాచారం. పార్టీ అనుయాయులకు పెండింగ్ ఉన్న బిల్లులను ఆగమేఘాల మీద విడుదల చేశారు.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. కాగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తన సొంత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. దీనితో జిల్లా అంతా పార్టీ కార్యకర్తల హడావిడితో కోలాహలంగా మారింది.






