ఏపీ మంత్రుల నోట ఎలాగూ వారి శాఖల గురించి ఏమీ వినలేము. కనుక కనీసం ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలోనైనా రాష్ట్రాభివృద్ధి గురించి నాలుగు ముక్కలు చెపితే విందామనుకుంటే ఆయన కూడా వాటి గురించి మాట్లాడరు.
ఎప్పుడూ చంద్రబాబు నాయుడు కుట్రలు, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పెళ్ళాలు, కడుపులు అంటూ చాలా ఎబ్బెట్టుగా మాట్లాడుతూ వాటితోనే ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
మరైతే అమరావతి, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, విద్యుత్, వ్యవసాయం, సాగుతాగు నీరు, రాష్ట్రాభివృద్ధి గురించి ఇంకెప్పుడు మాట్లాడుతారు? ఎవరు మాట్లాడుతారు?వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఎవరికీ తెలీదు.
ఈ 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదు. కనీసం విశాఖను రాజధాని చేయలేకపోయింది. అందుకే ఈ ప్రస్తావన రాకుండా జగన్‌తో సహా వైసీపిలో అందరూ చిల్లర మాటలు మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు.
పిఠాపురం వైసీపి అభ్యర్ధి వంగా గీతని ప్రజలకు పరిచయం చేస్తూ, “నా అక్క గీతమ్మ లోకల్. పవన్ కళ్యాణ్ నాన్ లోకల్. ఆయనకు జ్వరం వచ్చినా హైదరాబాద్ వెళ్ళిపోతారు. కానీ గీతమ్మ మాత్రం ఎల్లప్పుడూ మీ మద్యనే ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తుంది. కనుక లోకల్ హీరో గీతమ్మ కావాలా నాన్ లోకల్ సినిమా హీరో కావాలా? మీరే ఆలోచించుకోండి,” అని జగన్ అన్నారు.
వైసీపి అభ్యర్ధులలో సగం మంది వేరే నియోజకవర్గం, వేరే జిల్లా నుంచి ఊడిపడినవారే. ఉదాహరణకు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి, విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. వైసీపిలో ఈ నాన్ లోకల్ జాబితా చాలా పెద్దదే ఉంది. కానీ జగన్ వారిని పరిచయం చేసేటప్పుడు ‘పేదవారు, సౌమ్యులు, ఆణి ముత్యాలు’ అని చెపుతారు తప్ప వారు ‘నాన్ లోకల్’ అని చెప్పరు. కానీ పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అని నొక్కి చెపుతారు.
పవన్ కళ్యాణ్ జ్వరం వచ్చినా హైదరాబాద్ వెళ్ళిపోవడం తప్పన్నట్లు చెప్పిన జగన్ హైదరాబాద్‌లో ‘లోటస్ పాండ్’ కట్టుకున్నారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ హైదరాబాద్‌లో ఇళ్ళు, ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. వారిలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా హైదరాబాద్‌కే వెళ్ళి చికిత్స చేయించుకుంటారు తప్ప ఏపీలో చేయించుకోరు.
మంత్రి బొత్స సత్యనారాయణ భార్య పోటీ చేస్తున్న విశాఖలో అనేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇటీవల ఆయన హైదరాబాద్ వెళ్ళి గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఎందుకు?అని ఎవరూ ప్రశ్నించలేదు. కానీ పవన్ కళ్యాణ్‌కు వడదెబ్బ తగిలి జ్వరంతో హైదరాబాద్‌లో తన ఇంటికి వెళ్ళి మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే అది కూడా జగన్మోహన్ రెడ్డికి తప్పుగానే కనిపిస్తోంది.
ఇంత చిన్న విషయం గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న జగన్, అమరావతి, విశాఖ రాజధాని, అప్పులు, నిరుద్యోగ సమస్య గురించి ఒక్క ముక్క మాట్లాడరు! మాట్లాడితే ఆయన ఓటమిని ఆయనే కొని తెచ్చుకొన్నట్లవుతుంది కనుక. ఈ అంశాలపై ప్రతిపక్ష కూటమి కూడా వైసీపిని నిలదీయకుండా జగన్మాయలో కొట్టుకుపోతున్నాయి.




