‘కాల్ మనీ’పై చర్చ చేపట్టాలంటూ గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడిన ప్రతిపక్ష నేత జగన్, ఈ రోజు ‘కాల్ మనీ’పై సుదీర్ఘ ప్రసంగం చేసారు. అయితే, ఈ ప్రసంగాన్ని గమనిస్తే, దాదాపుగా గత వారం, పది రోజుల నుండి తెలుగు దిన పత్రికలలో ప్రచురితమైన ప్రముఖ కధనాలనే ప్రసంగించారు. ముఖ్యంగా ‘సాక్షి’ దినపత్రికలోని అంశాలు ప్రస్తావించగా, తర్వాత ‘మీ గెజిట్’ పేపర్లు అంటూ ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’ పత్రికలలోని కధనాలను చదివి వినిపించారు.
ఈ సందర్భంగా జగన్ తెలుగు ‘ఉచ్చారణ’ చర్చనీయాంశమైంది. తెలుగు చదవడానికి జగన్ పడ్డ ఇబ్బందులు బుల్లితెరపై అసెంబ్లీ సమావేశాలను ‘లైవ్’లో వీక్షిస్తున్న ప్రజలకు ‘నవ్వులు’ పండించాయి. అంతేకాదు, సోషల్ మీడియాలో జగన్ తెలుగు ప్రసంగాల ‘పదనిసలు’పై ఛలోక్తులు పడుతున్నాయి. ఇక, జగన్ చేసిన మొత్తం ప్రసంగం పస లేనిదిగా రాజకీయ విశ్లేషకులు తేల్చేసారు.
పత్రికలలోని వార్తలు చదవడానికన్నట్లుగా… అదే పనిగా పేపర్లు తిరగేయడం కేవలం కాలయాపన కార్యక్రమంగానే భావిస్తున్నారు. నిజానికి జగన్ చెప్పిన విషయాలన్నీ ప్రజలు రోజూ చదువుకుంటున్నవే. ‘కాల్ మనీ’పై చర్చకు పట్టు పట్టడంతో బహుశా జగన్ వద్ద ఏమైనా కొత్త విషయాలు దాగి ఉన్నాయేమోనన్న ఆసక్తి బాధితులతో పాటు, సామాన్య ప్రజానీకంలో కూడా వ్యక్తమయ్యింది. కానీ, ఎప్పటి మాదిరిగానే చివరకు జగన్ తుస్సుమనిపించడం విశేషం.





