కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వివేకా హత్య గురించే జగన్, అవినాష్ రెడ్డిలని గట్టిగా నిలదీస్తుండటంతో వారు జవాబు చెప్పుకోలేకపోతున్నారు.
దీని వలన అవినాష్ రెడ్డి పట్ల కడప ఓటర్లలో వ్యతిరేకత ఏర్పడి ఎన్నికలలో ఓడిపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక వైఎస్ షర్మిల ప్రచారంపై వైసీపి ఈసీకి ఫిర్యాదు చేయగా ఏసీ సానుకూలంగా స్పందిస్తూ ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించి మాట్లాడరాదని ఆదేశాలు జారీ చేసింది.
వివేకా హత్య గురించి మాట్లాడరాదని ప్రతిపక్షాలను హెచ్చరించిన ఈసీ, జగన్‌పై రాయి దాడి గురించి వైసీపి, దాని సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని మాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇదివరకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తాజాగా పవన్ కళ్యాణ్‌పై కూడా రాళ్ళ దాడి జరిగింది. అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. వైసీపి కూడా ఆ దాడులను రాజకీయ డ్రామాలుగా కొట్టిపడేసింది. కానీ ఇప్పుడు జగన్‌పై రాయి దాడి జరిగితే అది ముఖ్యమంత్రిని హత్య చేయడానికి జరిగిన కుట్రే అని వైసీపి, దాని సొంత మీడియా, ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా నిర్ధారించేశారు.
వైసీపి, దాని మీడియా ఇంతటితో ఆగలేదు. టిడిపి సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ టిడిపి అభ్యర్ధి బోండా ఉమా ఈ హత్యకు కుట్ర పన్నారన్నట్లు దుష్ప్రచారం చేస్తోంది. ఈ కేసులో నిందితులు వేముల సతీష్ బోండా ఉమాకు ప్రధాన అనుచరుడు అని దుష్ప్రచారం చేస్తోంది.
పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో నిందితుల కాల్ డేటా, ఇంకా ఇతర సాక్ష్యాధారాలతో ఈ కుట్ర వెనుక సూత్రధారులను కనుగొనవలసి ఉందని పేర్కొన్నారు. వివేకా హత్య గురించి వైఎస్ షర్మిల మాట్లాడకూడదన్నప్పుడు, జగన్‌పై రాయి దాడిని హత్యాయత్నమే అని వైసీపి, పోలీసులు ఎలా తీర్మానించేశారు? కోర్టు విచారణలో ఉన్న ఆ కేసు గురించి వైసీపి నేతలు, వారి సోషల్ మీడియా, సొంత మీడియాలో టిడిపికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఈ కేసుపై కోర్టు ఇంకా విచారణ మొదలుపెట్టక మునుపే వైసీపి ఈవిదంగా దుష్ప్రచారం చేస్తుంటే టిడిపి విజయావకాశాలపై ప్రభావం పడుతుంది కదా?ప్రతిపక్షాలపై ఆంక్షలు విధిస్తున్నప్పుడు, వైసీపికి ఈ వెసులుబాటు ఎందుకు కల్పిస్తున్నట్లు?
అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఈ కేసు రిమాండ్ రిపోర్టులో విషయాలు, కీలకమైన ఎన్నికల సమయంలో సాక్షి మీడియా చేతికి ఎలా వచ్చాయి?అది ఎలా ప్రచురిస్తోంది?ఈ కేసు గురించి మీడియాకు లీకులు ఇస్తున్న పోలీస్ అధికారులు ఎవరు?వారిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? అని ఈరోజు సాక్షి ఆన్‌లైన్ ఎడిషన్‌లో ‘బోండా బ్యాచ్ స్కెచ్… సిఎం జగన్‌ను హత్య చేసేందుకే’ పేరుతో ప్రచురించిన కధనాన్ని చూపిస్తూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.




