ఏపీ రాజకీయాలలో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్ళుగా గ్రహణం పట్టిన చంద్రుడిలా చీకటిలో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు, తిరుమల లడ్డు కేసు, వివేకా హత్య కేసులో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి.
ఈ ఒక్క రోజులోనే ఈ మూడు కేసుల పై వచ్చిన భిన్న ప్రకటనలు చూస్తే ఆ మూడు కేసులు భవిష్యత్ లో వైసీపీ రెక్కలు విరవబోతున్నాయా.? అన్న చర్చ మొదలయ్యింది. దశాబ్దాలుగా విచారణకు నోచుకోకుండా మూలపడ్డ కేసు నుంచి సొంత బాబాయ్ గొడ్డలి వేటు వరకు అలాగే హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదం తయారీ వంటి అనేక విషయాలలో వైసీపీ దోషిగా విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడా కేసులు విచారణకు సిద్ధమయ్యాయి. అందులో…
1. జగన్ అక్రమాస్తుల కేసు
2.వివేకా హత్య కేసు
3.తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసు.
ముందుగా జగన్ అక్రమాస్తుల కేసుల విషయానికొస్తే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం తెరమీదకొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు ఇప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ కేసుల విచారణకు హాజరు కావడం కుదరదని సాకు చూపించి విచారణకు గోవింద కొట్టారు. అయితే ఆ కేసులో ఇప్పుడు కీలక ముందడుగు పడింది.
సిబిఐ కేసులతో పాటుగా ఈడీ నమోదు చేసిన కేసులపై కూడా ఇక నుంచి రోజువారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం నిర్ణయించింది. దీనితో జగన్ తో సహా మరో 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించాలని కోర్ట్ నిర్ణయించింది. ఇదిలా ఉంటె మరోపక్క వివేకా హత్య కేసులో కూడా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
వివేకా హత్యారోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేసు విచారణకు నేడు హైద్రాబాద్ లోని ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో మనీలాండరింగ్ ద్వారా జరిగిన సుమారు 40 కోట్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఢీల్ కుదిరిందనే ఆరోపణల పై ఈడీ అధికారులు అవినాష్ ను విచారించినట్టు సమాచారం.
ఇక చివరిగా తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ కేసులో కూడా వైసీపీ కి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కుంటున్న భోలే బాబా, శ్రీ వైష్ణవి డైరీ లతో పాటుగా సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్ యాక్ట్ కింద రూ .129.85 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ పరిణామం ప్రత్యక్షంగా వైసీపీ ని రాకపోయినప్పటికీ పరోక్షంగా వైసీపీ ని కంగారుపెట్టే అంశమే అవుతుంది.
ఇలా ఈ ఒక్క రోజే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైసీపీ కి సంబంధించిన మూడు కేసులలో అధికారులు, న్యాయస్థానాలు ముందడుగు వేయడంతో వైసీపీ భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుంది.? ఈ కేసుల వలయంలో నుంచి విచారణ ల పర్వం నుంచి జగన్ అండ్ కో ఎలా బయటకొస్తారు అనేది ఆసక్తిగా మారింది.




