రాజకీయాల్లో విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సృష్టించిన ‘బికాంలో ఫిజిక్స్’ ఉదంతం ఎన్నటికి మరిచిపోలేనిది. ఈ దెబ్బతో జలీల్ ఖాన్ ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడని చెప్పడంలో సందేహం లేదు. అప్పటివరకు పెద్దగా తెలియని వారికి కూడా జలీల్ ఖాన్ అన్న పేరు ఓ రేంజ్ లో వినిపించింది. సరిగ్గా జలీల్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తే, ఇటీవల జగన్ పాదయాత్రలో ఉన్న సందర్భంగా… నడుస్తూనే ఓ ఇంటర్వ్యూ చేసారు. అయితే ఇందులో జగన్ చేసిన ఓ కామెంట్ ను పెద్దగా వాళ్ళు కూడా పట్టించుకోలేదో ఏమో గానీ, ఇప్పుడు సోషల్ మీడియా జనులకు ఇది పెద్ద ఆహారంలా మారింది.
“ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను కట్టే పని లేదని” వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. జగన్ వ్యాఖ్యలను చూసి నెటిజన్లు నవ్వుకోవడం ఒక వంతయితే, స్పెషల్ స్టేటస్ పై ఏ మాత్రం అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని చెప్పడానికి నిదర్శనంగా ఈ వ్యాఖ్యలు నిలుస్తాయని చెప్పవచ్చు. స్పెషల్ స్టేటస్ వస్తే, పరిశ్రమలకు పన్ను రాయితీలు లభించే అవకాశం ఉంటుంది గానీ, ఏకంగా ఇంకం టాక్స్ చెల్లించే వెసులుబాటు లేదన్న కనీస జ్ఞానం లేకపోవడం విస్తుపోయే అంశం. బహుశా జగన్ వస్తే ఇలాంటి రాయితీలు ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.
మొత్తానికి ‘స్పెషల్ స్టేటస్’పై ఓ పక్కన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు… మరో పక్కన అవగాహనాలేమితో చేసిన వ్యాఖ్యలు… జగన్ చిత్తశుద్ధిని మరోసారి బయటపెట్టాయి. పొరపాటున జగన్ ‘టంగ్ స్లిప్’ అయినా, సాధారణంగా దానిని ఎడిటింగ్ లో తీసేస్తుంటారు. కానీ వారు కూడా కనిపెట్టలేనంతగా జగన్ ఈ “ఇంకం టాక్స్”కు సంబంధించిన వ్యాఖ్యలు నిలిచాయి. ఎక్కడికి వెళ్ళినా… తిరిగి జగన్ “ఇంకం” దగ్గరికే రావడం అనేది నెటిజన్లు ట్రోల్ చేసే అంశంగా మారింది.



