ys-jagan-memantha-siddham

మన సినీ పరిశ్రమ ఆవిర్భవించినప్పటి నుంచి కమర్షియల్ సినిమాలు తీస్తూనే ఉన్నారు. వాటిలో విభిన్నంగా ఉన్నవాటిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.

ఇదే ఫార్ములాని ఏపీ రాజకీయాలకు కూడా వర్తింపజేసి చూస్తే, బటన్ నొక్కుడు సభల నుంచి నేడు ‘మేమంతా సిద్దం’ సభల వరకు ఈ ఐదేళ్ళలో జగన్మోహన్‌ రెడ్డి ఒకటే పాట పాడుతున్నారు.

ఆయన ప్రసంగాలలో కొత్త విషయం ఒక్కటీ ఉండకపోవడంతో, జనసమీకరణలో భాగంగా ఆయన సభలకు హాజరైనవారు వాటిని భరించలేక మద్యలో లేచి వెళ్ళిపోతున్నారు.

అంటే వైసీపి అనే కమర్షియల్ సినిమా మొదట్లో హిట్ కొట్టినప్పటికీ, మళ్ళీ మళ్ళీ దానినే రీ-రిలీజ్ చేసస్తుంటే చూసేందుకు ప్రజలు ఇష్టపడటం లేదనుకోవచ్చు.

జగనన్న సెట్ చేసిన ఈ రికార్డుని వైఎస్ షర్మిల కేవలం మూడు-నాలుగు నెలల్లోనే బ్రేక్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, జగనన్నపై విమర్శలతో జనాలని బోర్ కొట్టించేశారు. కానీ ఇప్పుడు ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తూ, శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులను పోటీకి దించడంతో మాట్లాడేందుకు ఆమెకు కాస్త కొత్త సబ్జెక్ట్ దొరికింది.

“ఆనాడు మా బాబాయ్ వివేకానందరెడ్డి నన్ను కడప నుంచి ఎంపీగా పోటీ చేయమని చాలా ఒత్తిడి చేశారు. అప్పుడు ఎందుకో నాకు అర్దం కాలేదు. కానీ ఆయనను హత్య చేసిన హంతకులని మా జగనన్న వెనకేసుకు వస్తుండటం చూస్తే ఇప్పుడు అంతా అర్దమయ్యింది,” అంటూ అన్న మీద షర్మిల మొదటి అస్త్రం సందించారు.

టిడిపి, జనసేన, బీజేపీల విషయానికి వస్తే వాటి పొత్తులు, సీట్ల పంపకాలు, లుకలుకలు, మళ్ళీ అంతలోనే సర్దుబాట్లతో ఎప్పటికప్పుడు ప్రజలను ఆకట్టుకొంటూనే ఉన్నాయి.

ముఖ్యంగా రాయలసీమ మండుటెండల్లో చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలతో ప్రజల మద్య తిరుగుతుండటం, పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ కళ్యాణ్‌ సామాన్య, నిరుపేదలతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారం చేస్తుండటం కూటమికి హైలైట్‌గా నిలుస్తున్నాయని చెప్పవచ్చు.

కనుక వైసీపి-కూటమిలను బేరీజు వేసుకొని చూసినప్పుడు కూటమిలో కొత్తదనం, ఉత్సాహం రెండూ స్పష్టంగా కనిపిస్తుంటే, వైసీపి అభ్యర్ధులందరూ ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అని ఆయన మీదే ఆశలు పెట్టుకొని ఎదురు చూపులు చూస్తున్నారు.

బీజేపీ అధిష్టానం ఏపీలో సీనియర్లకు టికెట్స్ ఇవ్వకుండా పక్కనపెట్టి షాక్ ఇవ్వడంతో ఏపీ బీజేపీలో చాలా నిర్లిప్తత కనిపిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్ళలో ఏపీకి ఏమేమి చేసిందో, ఎన్నివేల కోట్లు ధారపోసిందో చెప్తూ టీవీ, సోషల్ మీడియాలో జోరుగా ప్రకటనలు ఇస్తోంది.

ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల పర్యటనతో ఏపీ బీజేపీ కూడా రంగంలో దిగితే, ఎన్నికల వాతావరణం ఏర్పడిన్నట్లే. కానీ జగన్‌ ప్రభుత్వం విషయంలో ఇంతకాలం మెతక వైఖరి అవలంభించి నెత్తిన పెట్టుకునందుకు ఇప్పుడు ఏపీ ప్రజల నమ్మకాన్ని పొందడం చాలా కష్టమే. కనుక మోడీ, అమిత్ షాలు ఏపీ ప్రజలకు కొత్తగా ఏం చెప్తారో చూడాలి.