ఏపీలో అధికార, ప్రతిపక్షాలు నిర్వహించే సభలకు జనం రాలేదని, వచ్చినవారు కూడా మద్యలో లేచి వెళ్లిపోయారంటూ పరస్పరం ఆరోపించుకోవడాన్ని పక్కన పెడితే, ‘సిద్దం సభ’లతో జగన్ తన ప్రత్యర్ధుల ఊహకు కూడా అందనంతగా దూసుకుపోతున్నారని ఆత్మసాక్షి కనిపెట్టి చెప్పింది.
ఒకప్పుడు ఇందిరాగాంధి, ఆ తర్వాత ఎన్టీఆర్ వంటివారి సభలకు తీసిపోని స్థాయిలో లక్షాలాదిమంది జనాలు సిద్దం సభలకు తరలి వచ్చేసి, జగన్ పాడిన పాచి పాటలు విని ఉర్రూతలూగిపోతూ కోరస్ పడుతున్నారట!
రాష్ట్రం నలుమూలల నిర్వహించిన ‘సిద్దం సభ’లకు లక్షాలాదిగా తరలివచ్చిన జనాలు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నామని స్పష్టం చేయడంతో టిడిపి, జనసేనలకు వణుకు మొదలైందట! రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ‘ఓన్ చేసుకున్నారు’ కనుక త్వరలో జరుగబోయే ఎన్నికలలో వైసీపి భారీ మెజార్టీతో గెలవడం తధ్యమని, అలా కాకుంటే (ఓడిపోతేనే) ఆశ్చర్య పడాల్సి ఉంటుందని ఆత్మసాక్షి వైసీపి కళ్ళద్దాలు పెట్టుకొని రాష్ట్ర ప్రజల మనసులలోకి తొంగి చూసి, అధినేత కోరుకున్నట్లుగా చక్కగా జోస్యం చెప్పింది.
ఇటీవల తెలంగాణలో ఎన్నికల జరిగినప్పుడు కేసీఆర్, కేటీఆర్ సభలకు ఇలాగే ఇసుకవేస్తే రాలనంతగా జనాలు తరలివచ్చారు. కానీ ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి, కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేయవలసి వచ్చింది.
తెలంగాణలో పవన్ కళ్యాణ్ వీరాభిమానులు బైకులు వేసుకొని ఆయన కాన్వాయ్ వెనుక కేరింతలు కొడుతూ పరుగులు తీసి సభలకు హాజరయ్యారు. కానీ జనసేన పోటీ చేసిన 8 ఎమ్మెల్యే చోట్ల డిపాజిట్లు కోల్పోయింది!
పవన్ కళ్యాణ్ సభలకు జనసమీకరణ అవసరమే లేదు. వీరాభిమానులు అందరూ స్వచ్ఛందంగానే తరలివస్తుంటారు. కానీ సభకు వచ్చిన వాళ్ళు… వచ్చి తన ప్రతీ మాటకు చప్పట్లు కొట్టేవాళ్లు మనకి ఓట్లు వేయరనే గొప్ప సత్యాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోగలిగారు.
కానీ జగన్ సిద్దం సభలకు వైసీపి నేతలు వేలాది ఆర్టీసీ బస్సులను పట్టుకుపోయి వాటిలో ‘నయన్నోభయాన్నో’ జనాలను సిద్దం సభకి తోలుకువచ్చి కూర్చోపెడితే, వాళ్ళందరూ జగన్‌ని ఓన్ చేసుకున్నట్లే అవుతుందా?ఆయన ప్రతీ సభలో అదే పాచిపాట పాడితే జనాలు ఉర్రూతలూగిపోయారంటే నమ్మశక్యంగా ఉందా?
ఒకవేళ ఎన్నికలలో విజయం సాధించడం ఇంత సులువు అయితే రేపు చిలకలూరిపేటలో టిడిపి, జనసేన, బీజేపీల సభకు కూడా మరో 4-5 లక్షల మందిని తోలుకొస్తే సరిపోతుంది కదా?
ఓ వైపు టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులని చూసి వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు అందరూ లోలోన తీవ్ర ఆందోళన చెందుతూ, భయపడుతూనే, 5 ఏళ్ళుగా రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా ‘సిద్దం సభ’లతో ఎన్నికలలో గెలిచేయబోతున్నామని ఆత్మసాక్షి, వైసీపి, జగన్మోహన్ రెడ్డి ముగ్గురూ ఒకరికొకరు కళ్ళకు గంతలు కట్టుకొని సంతోషపడతామంటే ఎవరు వద్దంటారు? ఎందుకంటే వారికి ఇక మిగిలింది ఈ కొన్ని రోజుల అల్పసంతోషమే కదా! దానిని ఎవరైనా ఎందుకు కాదంటారు?




