తెలంగాణ రాజకీయాలలో తన మార్క్ చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోన్న వైఎస్ షర్మిల, ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై స్పందించనని చెప్తున్నారు. తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు జవాబులిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన షర్మిల ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కూడా ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడిగారు.
‘ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ’ కోసం అంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించబోగా… ‘ఏపీ గురించి నాతో మాట్లాడకండి’ అని షర్మిల బదులిస్తూనే ఓ తెలివైన జవాబును ఇచ్చినట్లుగా కనపడుతోంది. ఆ తర్వాత మరో ప్రతినిధి తెలంగాణ గురించి ప్రశ్నించగా, “చెప్పాను కదండీ, అసలు ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇదంతా, ఈయన పరిపాలన చేయడు, ఆయన పరిపాలన చేయడు” అంటూ బదులిచ్చారు.
దానికి కొనసాగింపుగా “అసలు కేసీఆర్ ఏమైనా చేస్తేనే కదా, బీజేపీ ఏమైనా చేద్దామని ఆలోచన చేయడానికి. ఒకరైనా మంచి చేస్తే పోటీ మీదట మరొకరు ప్రజలకు ఇంకా మంచి చేయాలని భావిస్తారని, కానీ ఇక్కడ దొందూ దొందే” అంటూ టీఆర్ఎస్ – బీజేపీలపై విమర్శలు గుప్పించారు. షర్మిల చెప్పింది తెలంగాణ గురించే అయినా, ప్రస్తుత ఏపీ స్థితికి అవి అద్దం పడుతుండడంతో ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తు చేసుకోవాలి. “అదేంటో అక్కడ తెలంగాణలో అధికార పార్టీ గురించి వైఎస్ షర్మిల చేస్తోన్న విమర్శలన్నీ, ఇక్కడ ఏపీ పార్టీకి తగిలినట్లుగా సరిగ్గా సరిపోతున్నాయి” అంటూ ఓపెన్ విత్ ఆర్కే లో చెప్పిన విషయం తెలిసిందే. ‘అసలు ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇదంతా, ఈయన పరిపాలన చేయడు, ఆయన పరిపాలన చేయడు’ అన్న షర్మిల వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారుతున్నాయి.
ఇక తన పార్టీ గుర్తింపుకు వచ్చేసరికి ఎన్నికల కమీషన్ కు దరఖాస్తు చేసుకుని ఒక ఏడాది పైనే అయ్యిందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెడుతున్న పార్టీ కావడంతో, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ చేత కూడా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ను తీసుకుని మరీ పెట్టానని, అప్పటి నుండి ఇప్పటివరకు మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నామని, ఇప్పటివరకు తమ పార్టీని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదో ఎలక్షన్ కమిషన్ ను అడగాలని మీడియాకు తెలిపారు.
YS Sharmila about Jagan and KCR
ఈయన పరిపాలన చెయ్యడు
ఆయన పరిపాలన చెయ్యడు#Jagan #KCR #YSRCPpic.twitter.com/nhTtj0Mji2— M9.NEWS (@M9Breaking) January 28, 2022