ఇంతకాలం వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి టికెట్స్ ఇస్తారా లేదా?అని ఆందోళన చెందుతుండేవారు. జాబితాల ప్రకటన మొదలయ్యాక వాటిలో తమ పెర్లని చూసుకొని మురిసిపోతున్న వారందరికీ ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ప్రతీ కొత్త జాబితాలో పాత జాబితాలలో ప్రకటించిన అభ్యర్ధులను మార్చేస్తుండటమే ఇందుకు కారణం.
మొన్న విడుదల చేసిన 8వ జాబితాలో చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభ్యర్ధి ఎన్.రెడ్డప్పని తొలగించి కల్లకుత్తూర్ కృపాలక్ష్మి పేరు ప్రకటించారు. దాంతో రెడెప్ప పరిస్థితి అయోమయంగా మారింది.
తాజాగా శుక్రవారం రాత్రి ప్రకటించిన 9వ జాబితాలో మంగళగిరి ఇన్‌చార్జి గంజి చిరంజీవిని తప్పించేసి, మురుగుడు లావణ్య పేరుని ప్రకటించారు.
గత ఎన్నికలలో నారా లోకేష్‌ని వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అక్కడ ఓడించారు. నారా లోకేష్ మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు కనుక మళ్ళీ ఆళ్ళనే బరిలో దింపుతారనుకుంటే, జగన్ ఆయనను పక్కన పెట్టేసి గంజి చిరంజీవిని నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించారు. అప్పటి నుంచి ఆయన మంగళగిరిపై పట్టు సాధించి నారా లోకేష్‌ని ఓడించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.
కానీ జగన్ ఆయనను కూడా పక్కనపెట్టేసి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యని మంగళగిరి అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో గంజి చిరంజీవి కూడా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పక్కన కూర్చోపెట్టిన్నట్లయింది. బహుశః 10వ జాబితాలో ఆమెను కూడా వారి పక్కన కూర్చోబెట్టినా ఆశ్చర్యం లేదు.
నారా లోకేష్ గురించి మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ వంటివారు చాలా చులకనగా మాట్లాడుతుంటారు. కానీ మంగళగిరిలో నారా లోకేష్‌ని ఓడించిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డితో సహా ఎవరూ వచ్చే ఎన్నికలలో ఆయనను ఎదుర్కొలేరని జగన్ భావిస్తూ ఇలా అభ్యర్ధులను పదేపదే మార్చుతుండటం గమనిస్తే, వైసీపిది మేకపోతు గాంభీర్యమే అని అర్దమవుతోంది.
వైసీపి 9వ జాబితాలో నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా వైసీపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు ప్రకటించడం కూడా చాలా ఆశ్చర్యకరమే. గత ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపి క్లీన్ స్వీప్ చేసిన తర్వాత పార్టీకి కంచుకోటలా మారింది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధులే దొరకడం లేదు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీని వీడటంతో జిల్లా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈసారి అక్కడ నుంచి శాసనసభకు పోటీ చేయిస్తోంది. కనుక రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆ సీటు ఇవ్వబోతే ఆయన తిరస్కరించి పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు.
ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రా రెడ్డి పేరు పరిశీలించి ఆయనని నిలబెడితే టిడిపి చేతిలో చాలా సులువుగా ఓడిపోతారని గ్రహించి చివరికి వియసాయి రెడ్డిని ఖరారు చేశారు.
వైసీపి 9వ జాబితాలో కర్నూలు శాసనసభ అభ్యర్ధిగా మాజీ ఐఎఎస్ అధికారి ఎ.ఎండి. ఇంతియాజ్ పేరుని ప్రకటించారు.




