సిద్ధం…సిద్ధం అంటూ నాలుగు బహిరంగ సభలు నిర్వహించి సుమారు 6 వందల కోట్లు ఖర్చు చేసిన జగన్ సర్కారు బాపట్ల జిల్లా మేదరమెట్ల లో జరిగిన ఆఖరి సిద్ధం సభలో వైసీపీ పార్టీ మానిఫెస్టో.., ఆ పార్టీ తరుపున ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తారు అంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆ కార్యక్రమం ఏ కారణం చేతనో వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు బయటకొస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆశావహులకు శుభవార్త చెప్పారు ఆ పార్టీ పెద్దలు. సిద్ధం సభలతో పార్టీ క్యాడర్ ను ఎలర్ట్ చేసిన ముఖ్యమంత్రి జగన్…ఇక ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 16 న ఇడుపులపాయలోని తన తండ్రి వైస్సార్ సమాధి దగ్గర నివాళ్లర్పించి అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్లు ప్రకటించింది వైసీపీ.
వైసీపీ నుండి అసెంబ్లీకి పోటీ చేయబోయే 175 మంది ఎమ్మెల్యే లను, పార్లమెంట్ కు పోటీ చేయబోయే 25 మంది ఎంపీ లను సీఎం జగన్ ఇడుపులపాయ నుండి ప్రకటించనున్నారు. మొన్నటిదాకా ఇంచార్జ్ ల మార్పుతో కలవరం చెందిన ఆ పార్టీ నేతలు, నాయకులలో ఈ సీట్ల పంచాయితీ మరో సమస్యగా మారనుంది. అలాగే సీట్ల ప్రకటన తో ఆశావహులు.. అసంతృప్తులు…అసమ్మతులు….మరోసారి పార్టీ నుండి బయటకు వచ్చి పార్టీ మీద పార్టీ అధినేత మీద వ్యతిరేక నినాదాలు చేసే ప్రమాదం లేకపోలేదు.
జగన్ నియంత వైఖరికి వ్యతిరేకంగా చాలామంది సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అలాగే ఇప్పటికే బయటకు వచ్చిన 5 గురు వైసీపీ సిట్టింగ్ ఎంపీలలో 4 గురు టీడీపీలో ఒకరు జనసేనలో చేరిపోయారు. ఇక ఈ సీట్ల పంచాయితీతో వైసీపీలో మరింత ముసలం పుట్టడం ఖాయంగా కనపడుతుంది. ఈ అసమ్మతిని తగ్గించడానికి ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే జగన్ పార్టీ నాయకులకు ఇంకెన్ని హామీలిస్తారో..?
ఈ హామీలను నిలబెట్టుకోవడానికి ఇంకెంతమంది సలహాదారులను నియమిస్తారో..ఇంకెన్ని కొత్త పదవులు సృష్టిస్తారో, ఇంకెంత స్థాయిలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేస్తారో చూడాలి. ఇక ఈ నెల 16 శనివారం అభ్యర్థుల ప్రకటనకు జగన్ సిద్ధమవుతుంటే….సీట్లు ఆశించి భంగపడినవారు అసమ్మతికి సిద్ధమవుతారు. అభ్యర్థుల ప్రకటన తరువాత ఈ నెల 18
నుంచి గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారభించనున్నారు జగన్. రోజుకి మూడు నుంచి నాలుగు సభలతో ప్రతిపక్షాలు మీద విరుచుకుపడడానికి వైసీపీ రూట్ మ్యాప్ కూడా రెడీ చేసినట్లు సమాచారం.




