వైసీపీ కార్యాచరణ ఎప్పుడూ పకడ్బందీగానే ఉంటుంది. ముందుగా ఒక అంశం లేదా సమస్యని గుర్తిస్తుంది. దానిపై ఏవిధంగా ముందుకు సాగాలో ముందే ఆలోచించుకొని, అన్ని ఏర్పాట్లు చేసుకొని కార్యాచరణకు దిగుతుంది.
తాము ఎంచుకున్న అంశం లేదా సమస్య తప్పని తెలిసిపోతున్నా దానికే కట్టుబడి ఉండే నిబద్దత వైసీపీకి మాత్రమే ఉంది.
‘మావిగన్’ ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ అనుకుంటే, డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ హైకోర్టు వెళ్ళి అక్కడ మొట్టికాయలు వేయించుకు వచ్చినా, నేడు విజయవాడలో వైసీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేయడం మరో చక్కటి ఉదాహరణగా కనిపిస్తోంది.
కనుక తప్పో ఒప్పో బలంగా నిలబడి పోరాడటం వైసీపీ గొప్ప లక్షణంగా భావించవచ్చు. దాని పోరాటాలకు అర్థం, పరమార్ధం రెండూ వేర్వేరుగా ఉంటాయి.
కనుక డీఎస్సీ పేరుతో చేసే ఆందోళనలకు తలొగ్గి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేస్తారని వైసీపీ ఏమీ ఆశపడటం లేదు.
కానీ ఈ ఆందోళనలతో జెన్-జీని ఆకట్టుకోవడం, ఎన్నికలలో తమ పార్టీకి కేవలం 11 సీట్లే వచ్చినప్పటికీ ప్రజలందరూ తమ వైపే ఉన్నారని చెప్పుకోవడానికి, తమ ఆందోళనలతో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గజగజా వణికిపోతున్నారని గొప్పలు చెప్పుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది.
అలాగే ఈ ఆందోళనలను అణచివేయాలని మంత్రి నారా లోకేష్ పోలీసులను ఆదేశించారని చెప్పుకోగలుగుతోంది. అంటే ఢిల్లీలో సీజేపీ ఆందోళనల నమూనాని మక్కికి మక్కీ కాపీ కొట్టి అనుసరిస్తోందన్న మాట!
అయితే తమ ఆందోళనలతో నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేస్తారని కానీ, సీబీఐ చేత విచారణ జరిపిస్తారని గానీ వైసీపీ ఆశించడం లేదనే చెపొచ్చు.
ఈ రెండూ జరిగితే వైసీపీకి ఊహించనంత మైలేజ్ లభిస్తుంది. లేకున్నా ఈ ఆందోళనలు వీలైనంత ఎక్కువ కాలం కొనసాగిస్తూ, కూటమి ప్రభుత్వం నిజంగానే తప్పు చేసిందని ప్రజలను నమ్మించ వచ్చని భావిస్తున్నట్లుంది. కనుక వైసీపీ పోరాటాలు డీఎస్సీ కోసమా లేక కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీయడం కోసమా?




