మరో సలహాదారు దేనికి… ఇది పోయేకాలం కదా?

Nemani-Bhaskar

మరో 3-4 నెలల్లో ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. 175 సీట్లతో మళ్ళీ వస్తామని జగన్‌ చెప్పుకొంటున్నప్పటికీ పొరుగు రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలను చూసి కంగారుపడుతూ హడావుడిగా మంత్రులతో సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలని, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చేయడం చూస్తుంటే మళ్ళీ వస్తామనే నమ్మకం లేన్నట్లే కనపడుతోంది. ఉంటే ‘సింగిల్ సింహం’ ఎప్పటిలాగే ధీమాగా గర్జిస్తూ ఉండేది కదా?

ADVERTISEMENT

కనుక 175 సీట్లు మేకపోతు గాంభీర్యమే అని స్పష్టమవుతోంది. 175 సంగతేమో కానీ ఈ ఎమ్మెల్యేల మార్పులు, చేర్పులతో కడుపు మండి ఏ కోనసీమ మంత్రి నేతృత్వంలోనో వైసీపి ఎమ్మెల్యేలే ఎన్నికల కంటే ముందే జగన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినా ఆశ్చర్యం లేదు. ఇది వైసీపి సమస్య కనుక ఇప్పుడా చర్చ అనవసరం.

కానీ ప్రతీ విషయంలోను జగన్మోహన్‌ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ వాటికి తన మంత్రులను, ఎమ్మెల్యేలను, చివరికి ఉన్నతాధికారులను కూడా బాధ్యులను అలియాస్ బలిపశువులను చేస్తున్నప్పుడు మళ్ళీ ఆయనకు మరొకరు సలహాలు అవసరమా? సలహాలు ఇచ్చినా పాటిస్తారా?

అసలు వైసీపి మంత్రులలో తమ అధినేతకు సలహా ఇచ్చే ధైర్యం ఎవరికైనా ఉందా?అంటే లేదనే చెప్పాలి. ఉంటే నేడు ప్రభుత్వం పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి, చివరికి వైసీపి పరిస్థితి ఈవిదంగా ఉండేదా?మరి అటువంటప్పుడు 50 మంది సలహాదారులు ఎందుకు?వారికి జీతభత్యాలు దేనికి చెల్లిస్తున్నట్లు?

మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి వందల కోట్లు ఫీజులు చెల్లిస్తున్న ఐప్యాక్ సలహాలు కూడా పాటించనప్పుడు మళ్ళీ మరో సలహాదారు దేనికి?అదీ… పోయేకాలం దగ్గర పడినప్పుడు అంటే… ఎన్నికలకు 3-4 నెలల ముందు?అంటూ గిట్టనివారు సన్నాయి నొక్కులు నొక్కుతుండవచ్చు.

కానీ జనం నవ్వితే నవ్విపొదురు గాక నాకేటి… అన్నట్లు వైసీపి ప్రభుత్వం తమ సాక్షి మీడియాలో పనిచేసిన నేమాని భాస్కర్‌ను ‘ప్రభుత్వ ప్రజావిధానాల సలహాదారు’ పదవిలో తక్షణమే నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే మరో 3-4 నెలల్లో ఈ ప్రభుత్వం గడువు ముగుస్తున్నప్పుడు కొత్తగా ప్రకటించే ‘పబ్లిక్ పాలసీ’ ఏమిటి? దానికి సలహాదారు దేనికి?అనే చిలిపి ప్రశ్న వినిపిస్తోంది.

ఎలాగూ 175 సీట్లతో మళ్ళీ మనమే వచ్చేస్తే అప్పుడే 175 మంది అసమదీయులను సలహాదారులుగా నియమించుకొంటే ఎవరు కాదంటారు?అంటూ గిట్టని ప్రతిపక్షాలు, గిట్టని మీడియా ధర్మసందేహాలు అడుగుతూనే ఉన్నాయి. అలాగని మూడు రాజధానులపై ప్రజలు, ప్రతిపక్షాలు, దేశ ప్రజలు నవ్వితే పట్టించుకొన్నామా లేదు కదా? ఇదీ అంతే! ఇటువంటివన్నీ పట్టించుకొంటే ముందుకు సాగడం కష్టం. కనుక ప్రొసీడ్ అయిపోవాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories