ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా జనసేన పార్టీ ద్వారా కాపు సామాజికవర్గానికి రాజ్యాధికారం దక్కే సూచనలు కనబడుతోంది. ఇటువంటి కీలక సమయంలో కాపు పెద్దలమని, శ్రేయోభిలాషులమని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య ఇద్దరూ తమ బేషజాలను పక్కనపెట్టి పవన్ కళ్యాణ్‌కు సహకరించి ఉండాలి.
ఇంతకాలం కాపుల మద్య అనైక్యత వలననే రాజకీయంగా నష్టపోయామని వారు వాదిస్తుండేవారు. కనుక ఈ ఎన్నికలలో రాష్ట్రంలో కాపులందరినీ ఏకం చేసి జనసేనను భారీ మెజార్టీతో గెలిపించుకునే ప్రయత్నం చేసి ఉండాలి.
కానీ తాము సూచించినవారికి పవన్ కళ్యాణ్ టికెట్లు ఇవ్వాలేదని ఒకరు, టిడిపి, బీజేపీలతో సీట్ల బాట్లని వ్యతిరేకిస్తూ మరొకరు జనసేనకు దూరం అయ్యారు.
కేవలం దూరం అయితే ఎవరూ వారిని వేలెత్తి చూపరు. కానీ ముద్రగడ పద్మనాభం వైసీపిలో చేరి, రాష్ట్రంలో కాపుల ఓట్లను నిలువునా చీల్చి జనసేనని దెబ్బ తీయాలనుకోవడమే తప్పు.
జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పదవి, అధికారం రెండూ కావాలి. కానీ టిడిపి దాని అధినేత చంద్రబాబు నాయుడు అడ్డువస్తున్నారు. కనుక జగన్ టిడిపిని చంద్రబాబు నాయుడుని ద్వేషించడం, ఓడించాలనుకోవడం సహజమే. టిడిపిని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు జనసేనను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే ముద్రగడ పద్మనాభంను వైసీపిలో చేర్చుకున్నారు తప్ప తనపై గౌరవంతో కాదు.
ఈ విషయం బహుశః ముద్రగడ పద్మనాభంకు తెలిసే ఉంటుంది. తన ఈ నిర్ణయం వలన కాపులకు నష్టం కలుగుతుందని కూడా తెలిసే ఉంటుంది. కానీ ఆయన జగన్ చేతిలో పావుగా మారాలనుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
పైగా పదేపదే పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి ‘దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి నన్ను విమర్శించు…’ అంటూ సవాళ్ళు విసురుతుండటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా తమ రాజకీయ ప్రత్యర్ధులను ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శిస్తారే తప్ప ప్రత్యర్ధులనే ప్రెస్‌మీట్ పెట్టి తమని విమర్శించమని ఎవరూ కోరరు. కానీ ముద్రగడ పద్మనాభం కోరుతున్నారు.
అలాగని ఆయనకు పవన్ కళ్యాణ్ ఏమైనా శతృత్వం, దానికి బలమైన కారణం ఏమైనా ఉందా?అంటే ఏదీ లేదు. మరి అటువంటప్పుడు పవన్ కళ్యాణ్‌ని పిలిచి మరీ గొడవ పెట్టుకోవాలనుకోవడం దేనికి?అంటే పవన్ కళ్యాణ్ తనను విమర్శిస్తే ఆ వంకతో తాను కాపుల సానుభూతి సంపాదించుకొని దానిని ఓట్ల రూపంలో వైసీపి ఖాతాలో జమా చేయాలని అనుకుంటున్నట్లున్నారు. మరీ ఇంత జగన్ భక్తి అవసరమా ముద్రగడ పద్మనాభం గారు?




