వైసీపిలో అందరికీ ఒకటే డౌట్: మా నమ్మకం నువ్వేనా జగన్?

YS Jagan

గురువారం రాత్రి వైసీపి 8వ జాబితా ప్రకటించింది. దానిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు, కిలారు రోశయ్యకి గుంటూరు ఎంపీ సీటుని ఖరారు చేసింది.

ఈ జాబితాలో కందుకూరు ఇన్‌చార్జిగా బుర్రా మధుసూధన్ యాదవ్‌, పొన్నూరు ఇన్‌చార్జిగా అంబటి మురళి, గంగాధర నెల్లూరు (జీడి నెల్లూరు) ఇన్‌చార్జిగా కల్లకుత్తూర్ కృపాలక్ష్మిని ఖరారు చేశారు.

ADVERTISEMENT

మాగుంటకి మళ్ళీ టికెట్‌ ఇప్పించేందుకు ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అధిష్టానంతో పోరాడి అలిసిపోయారు. ఒకానొక సమయంలో పార్టీని వీడేందుకు కూడా సిద్దమయ్యారు. కానీ బాలినేని కోరుకొన్నట్లుగా ఒంగోలులో ఇళ్ళ స్థలాల పంపిణీకి జగన్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాలినేని యుద్ధ విరమణ చేసి మళ్ళీ ‘నువ్వే మా నమ్మకం జగన్’ అంటూ వైసీపిలో సర్దుకుపోతున్నారు.

తన కోసం పోరాడిన బాలినేని జగన్‌తో రాజీపడటంతో మాగుంట పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని వెనకేసుకువస్తున్న జగన్‌, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంటని ఎందుకు వద్దనుకున్నారో తెలీదు. కానీ ఆయనకు పొగ పెట్టి బయటకు పంపగానే ఒంగోలు ఎంపీ టికెట్‌ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఖరారు చేసేశారు.

“వైసీపి జాబితాలలో పేర్కొన్నవారికే టికెట్లు… అవే దాదాపు ఫైనల్… కనుక జాబితాలలో పేర్లున్న అభ్యర్ధులందరూ చొక్కా మడత పెట్టి యుద్ధం మొదలుపెట్టాలని…” జగన్మోహన్‌ రెడ్డి మొన్ననే చెప్పారు.

వైసీపి నాలుగో జాబితాలో జీడి నెల్లూరు నియోజకవర్గం ఇన్‌చార్జిగా తన పేరు కనపడటంతో ఎన్‌.రెడెప్ప చొక్కా మడత పెట్టి ‘పని’ మొదలుపెట్టేశారు.

కానీ నిన్న రాత్రి వైసీపి 8వ జాబితాలో ఆయన స్థానంలో కల్లకుత్తూర్ కృపాలక్ష్మిని ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు తెలియజేసింది. కనుక ఇప్పుడు ఆయన ఎవరిని నమ్ముకోవాలో… ఎవరి తరపున ఎవరితో యుద్ధం చేయాలో తెలీని పరిస్థితి.

జగన్‌ బంధువు, సన్నిహితుడు వైవీ సుబ్బారెడ్డి మూడు రోజుల క్రితం విశాఖలో పర్యటించినప్పుడు ఓ బాంబు పేల్చారు. కానీ దానిని మీడియా పట్టించుకోకపోవడంతో అది ‘తుస్సు’మంది.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “వైసీపి జాబితాలలో ప్రకటించినవారందరికీ టికెట్లు లభిస్తాయని అని అనుకోవద్దు,” అని అన్నారు.

ఆ తర్వాత జగన్‌ కూడా ‘జాబితాలలో ఒకటీ ఆరా మార్పులు ఉంటాయి వాటిని పట్టించుకోనవసరం లేదని’ చిన్న హింట్ ఇచ్చారు.

వారిద్దరూ చెప్పిన్నట్లే ప్రతీ కొత్త జాబితాలో పాత జాబితాలోని అభ్యర్ధుల స్థానంలో కొత్తవారి పేర్లు కనబడుతున్నాయి.

అంటే ఈ జాబితాలు, వాటిలో ఇన్‌చార్జిలు అన్నీ కూడా పార్టీ నేతలను, టికెట్లు ఆశిస్తున్నవారు పక్క చూపులు చూడకుండా కట్టడి చేయడానికేనా?ప్రతిపక్షాలను, మీడియాని మభ్యపెట్టడానికేనా?అసలు జాబితా ఇంకా విడుదల చేయలేదా?కాకుంటే ఎంతో కసరత్తు చేసి తయారుచేస్తున్న ఈ జాబితాలో ఇంకా ఈ మార్పులు చేర్పులు దేనికి?

జాబితాలో ఎంతమందికి జగన్‌ బీ-ఫార్ములు ఇస్తారు? వైసీపిలో ఎవరు ఎవరిని నమ్మాలి? పార్టీ నేతలను జగన్‌ నమ్మాలా? లేక జగన్‌ తమకు తప్పకుండా బీఫారంలు ఇస్తారని జాబితాలో ఉన్నవారు నమ్మకం పెట్టుకోవాలా?

ఏమో! ఎంత అయోమయంగా ఉన్నా అందరూ చొక్కా మడత పెట్టి యుద్ధానికి సిద్దం కావలసిందే!175/25 సీట్లు మనమే గెలిచేస్తామని నమ్మాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories