వైసీపీ నగరి ఎమ్మెల్యేగా ఉండే రోజా ఎప్పటికైనా మంత్రి పదవి చేపట్టాలని కలలు కంటుండేవారు. చివరికి జగనన్న కటాక్షించడంతో మంత్రి పదవి దక్కింది. అయితే ఆమె తన పర్యాటకశాఖకి సంబందించిన విషయాల కంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లని విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి ఈమాత్రం దానికి మంత్రి పదవి ఎందుకు? ఆమె మీడియా ముందుకు వచ్చారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లని విమర్శించడానికైనా ఉంటుంది లేదా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి భజన కోసమైన ఉంటుంది. వారిరువురినీ బాగా విమర్శించినందుకే తనకి మంత్రి పదవి లభించింది కనుక అదే తన డ్యూటీ అనే భ్రమలో మంత్రి రోజా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆ డ్యూటీలో భాగంగా ఆమె మరోసారి పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. నేటికీ తన రాజకీయనేతగా కాక నటిగా గుర్తింపుతోనే ప్రజలు తనకు ఓట్లు వేస్తున్నారనే సంగతి మరిచినట్లు సినిమా వాళ్ళని చూసి ప్రజలు ఓట్లువేసే రోజులు పోయాయని విమర్శించారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో చిరంజీవితో సెల్ఫీలు తీసుకొన్న ఆమె సొంత నియోజకవర్గాలలోనే గెలవలేని మెగా బ్రదర్స్ ముగ్గురూ రాజకీయాలకి పనికిరారని సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ విరామంలో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ మాటలని రాష్ట్ర ప్రజలు ఎవరూ విశ్వసించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తన అన్న చిరంజీవిలాగే పార్టీని మూసేసి సినిమాలు చేసుకొంటూ బ్రతకక తప్పదని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. జగన్ భజనలో తరించిపోయే మంత్రి రోజా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భజనలో తరించిపోతున్నారంటూ ఎద్దేవా చేయడం విశేషం.
పవన్ కళ్యాణ్‌కి రాజకీయాలకి పనికిరాడు… ఆయనకి అంత సీన్ లేదు… వచ్చే ఎన్నికల తర్వాత పార్టీని మూసేస్తాడని మంత్రి రోజాకి, మిగిలిన మంత్రులకి అంతగా నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి సిఎం జగన్ మొదలు ఎమ్మేల్యేల వరకు అందరూ నిత్యం పవన్ కళ్యాణ్ భజన ఎందుకు చేస్తున్నట్లు? జనసేన పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందో చెప్పమని పదేపదే అడుగుతుండటం దేనికి?పదవి అధికారంలో ఉన్నాము కదాని రోజావంటివారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లని ఉద్దేశ్యించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటే, వారిరువురి కంటే తామే ప్రజల దృష్టిలో పలుచన అవుతామని తామే నష్టపోతామనే సంగతి గ్రహించినట్లు లేదు. గత ఎన్నికల వైసీపీ ప్రభంజనం వీచినప్పుడు కూడా రోజా నగరిలో భారీ మెజార్టీతో గెలవలేకపోయారు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని టిడిపి అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ మీద కేవలం 2,708 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అప్పుడే భారీ మెజార్టీ సాధించలేకపోయిన రోజా, రాష్ట్రంలో వైసీపీకి నానాటికీ వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు వచ్చే ఎన్నికలలో ఆమె గెలవగలరా?ఎందుకంటే సినీ గ్లామర్‌తో కూడా ఓట్లురాలవని ఆమె స్వయంగా చెపుతున్నారు కదా?



