అభివృద్ధిని వ్యతిరేకిస్తూ, తప్పులు సమర్దిస్తుంటే…

YSRCP Politics: Is Jagan Ignoring Public Sentiment?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చినట్లే జగన్మోహన్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చారు. అయితే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కనుక ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడుకే రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. ఇదేమీ రహస్యం కాదు.

కనుక ఆయన ఎప్పటిలాగే అభివృద్ధి పనులు జోరుగా సాగిస్తున్నారు. వాటిలో భోగాపురం విమానాశ్రయం వంటివి పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు.

ADVERTISEMENT

అలాగే అమరావతి, పోలవరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అవన్నీ కూడా రాబోయే మూడేళ్ళలో పూర్తయితే, చంద్రబాబు నాయుడు హయంలో ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా కళ్ళకు కనిపిస్తుంది.

కళ్ళకు కనిపించే స్థాయిలో జరిగిన ఈ అభివృద్దే వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ కూటమి ప్రభుత్వంవైపు మొగ్గు చూపేలా చేస్తుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే ప్రమాద సంకేతాలను పసి గట్టడంలో ఆయనని మించినవారు లేరు.

అటువంటప్పుడు మరింత బలమైన కార్యాచారణతో ముందుకు సాగాలి తప్ప అభివృద్ధిని చూసి అసూయ పడటం వలన ప్రయోజనం ఉండదు. పైగా తాను అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు నాయుడు చేస్తుంటే వ్యతిరేకిస్తున్నారనే భావన ప్రజలకు కలుగుతుంది.

ఇది సరిపోదన్నట్లు పార్టీలో రకరకాల నేరాలలో కేసులు ఎదుర్కొంటున్నవారిని కూడా వెనకేసుకువస్తున్నారు. తద్వారా వారికి అండగా నేనున్నానని తెలియజేస్తున్ననని అనుకుంటున్నారు. కానీ సరిగ్గా ఇదే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తోందని గ్రహించినట్లు లేదు.

ఉదాహరణకు శ్రీకాకుళంలో ఓ రోడ్డు ప్రమాదం కేసులో కొడుకుని కాపాడుకునేందుకు సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రస్తుతం రిమాండ్‌పై జైలులో ఉన్నారు. ఆయనని పరామర్శించేందుకు జగన్‌ బయలుదేరారు.

తద్వారా కూటమి ప్రభుత్వం తమని రాజకీయంగా వేధిస్తోందని ప్రజలకు సంకేతం ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పరామర్శ తర్వాత అదే చెప్పవచ్చు.

కానీ ఒక మనిషి చావు వైసీపీకి చిన్న సమస్యగా, ఆ కారణంగా తమ పార్టీ నేత అరెస్ట్ అతిపెద్ద సమస్య అని జగన్‌ భావించవచ్చేమో కానీ ప్రజలు అలా భావించరు కదా?

పార్టీ నేతలు తప్పులు చేస్తున్నప్పుడు వారి అధినేత వారించాలి. కానీ సమర్దిస్తుంటే.. ప్రజలు హర్షిస్తారా?

తప్పులు చేసినా ప్రజలు గుర్తించలేరు లేదా ఎన్నికల నాటికి అన్నీ మరిచిపోతారు లేదా ఎన్నికలలో మభ్యపెట్టవచ్చని ఏ రాజకీయ పార్టీ అనుకున్నా దానికి పతనం తప్పదు. ఇది ఒక్క వైసీపీకి మాత్రమే కాదు.. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories