మొబైల్ సిగ్నల్ రాకపోతే ఏం చేయాలి?

Jio signal issue in UP village

ఇప్పుడు కనీసం రూ.50 వేల నుంచి లక్ష ఖరీదు చేసే మొబైల్ చేతిలో లేకపోతే చాలా నామోషీగా ఫీలవుతున్నారు జనాలు. మీరింకా అక్కడే ఉండిపోతే ఎలా? అంటూ కొన్ని మొబైల్ ఫోన్ కంపెనీలు లక్షన్నరతో జనాలను మడత పెట్టి అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇలాంటి విషయాలలో జనం తరపు ఆలస్యం ఎప్పుడూ ఉండదు. మొబైల్ ఫోన్ కంపెనీలదే ఆలస్యం అని యాపిల్ ఫోన్లు, ఐ ఫోన్ల అమ్మకాలు చెప్తున్నాయి.

ADVERTISEMENT

మరి అలాంటి గొప్ప గొప్ప ఫోన్లు వచ్చేస్తుంటే మనం వెనకబడిపోతే ఎలా.. అనుకుంటూ టెలికాం కంపెనీలు వన్, టూ, త్రీ అంటూ ఫైవ్ జీ వరకు వచ్చేసాయి. వచ్చే ఏడాది మనల్ని మరికాస్త పిండేసి రెక్క పుచ్చుకొని మరో జీలోకి తీసుకుపోవడం ఖాయం. జనాలు కూడా అలాగే జీ అంటూ సిద్ధంగానే ఉన్నారు.

కనుక ఎడాపెడా సిమ్‌ కార్డులు కోనేస్తూ, డొక్కు రూ.50 వేల మొబైల్ ఫోన్స్ మార్చేసి మడతెట్టేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ కాల్ డ్రాప్స్, కాల్స్ కలవకపోవడం, కలిసినా వాయిస్ క్లియర్‌గా లేకపోవడం వంటివాటికి కూడా జనాలు బాగా అలవాటు పడిపోయారు.

కానీ ఇంగ్లీషు సినిమాలలో వ్యోమగాములు వేరే గ్రహం నుంచి లేదా స్పేస్ షిప్ నుంచి వీడియో కాల్ చేసి అమెరికాలో ఉన్న తమ భార్యాపిల్లలతో కులాసాగా కబుర్లు చెపుతున్నప్పుడు మనవాళ్ళు కాస్త అసూయ పడుతుంటారు. వాళ్ళు వేరే గ్రహం నుంచే అంత స్పష్టంగా వీడియో కాల్స్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, అనకాపల్లి నుంచి సామర్లకోటకి ఫోన్ చేస్తే ఎందుకు వాయిస్ క్లారిటీ ఉండటం లేదు జీ? అని మధనపడుతుంటారు జనాలు.

మొబైల్ టవర్లు పెడితే క్యాన్సర్ వస్తుందని మీరే వద్దంటారు. మళ్ళీ కాల్స్ ఎందుకు కలవట్లేదు? వాయిస్ స్పష్టంగా ఎందుకు లేదని మీరే నిలదీస్తారు. అయినా మరో రెండో మూడొందలో ప్లాన్లోకి అప్‌డేట్‌ అవ్వమని మొత్తుకుంటూనే ఉన్నాము కదా?అని టెలికాం కంపెనీలు సన్నాయి నొక్కులు నొక్కుతుంటాయి.

కానీ యూపీలో జనాలు మన అంత మంచోళ్ళు కారు.. వాళ్లకి మన అంత ఓర్పు, సహనం కూడా ఉండదు. పైగా వాడేది వెయ్యి రూపాయల డొక్కు ఫోను. అయినా వాయిస్ క్లారిటీ ఉండాలి. బిల్లింగ్ సరిగ్గా ఉండాలి.. అంటూ సవాలక్ష షరతులు విధిస్తుంటారు.

ఫతేపూర్ జిల్లా హర్దౌలి గ్రామంలో చాలా రోజులుగా జియో ఫోన్ సిగ్నల్ సరిగ్గా ఉండక, కాల్స్ కనెక్ట్ అవడం లేదు. దీంతో గ్రామస్తులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఓ జియో కంపెనీ ఉద్యోగి గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు అతనిని పట్టుకొని జియో టవర్‌కే తాళ్ళతో కట్టేశారు.

శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని జగన్‌ మారం చేస్తున్నట్లే, వారు కూడా తమ మొబైల్ ఫోన్లు పని చేస్తేనే విడిచి పెడతామని మారం చేశారు.

అంబానీకి ఈవిషయం తెలుసో లేదో కానీ పోలీసులకు తెలిసింది. పరుగున వచ్చి ఆ ఉద్యోగిని విడిపించి పంపించారు. మడత ఫోన్లు జేబులో ఉన్నా.. మరో 10జీలు వచ్చినా మన దేశంలో మొబైల్ నెట్‌వర్క్ మాత్రం ఎప్పుడూ ఇంతే..నా?

ADVERTISEMENT
Latest Stories