చంద్రబాబుకి బాధ్యత… జగన్‌కి శవ రాజకీయాలు!

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి నేడు విశాఖ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను వారి కుటుంబాలను పరామర్శించారు. వారిలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ADVERTISEMENT

రోగులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది కనుకనే ఐసీయూలోకి ఎవరినీ రానీయరు. కానీ జగన్‌ అండ్ కో దర్జాగా లోనికి వెళ్ళడమే కాకుండా రోగుల చేతులు పట్టుకొని మరీ మాట్లాడారు. జగన్‌తో సహా ఎవరూ యాప్రాన్, కనీసం మాస్క్ కూడా ధరించకుండానే క్షతగాత్రుల వద్దకు వెళ్ళారు.

ఆయన పరామర్శకు మీడియా కవరేజ్ కూడా కావాలి కనుక ఫోటో గ్రాఫర్‌ కూడా లోనికి వెళ్ళాడు. జగన్‌ చిరునవ్వులు చిందిస్తూ వారితో మాట్లాడుతుంటే సిద్దంగా ఉన్న ఫోటోగ్రాఫర్ చకచకా ఫోటోలు తీశాడు. అంటే వారి ఆరోగ్యం కంటే పరామర్శ-ఫోటోలే ముఖ్యమన్న మాట!

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పాలో తెలీక చాలాసార్లు ఆ ఘటన… ఆ ఘటన అంటూ తడబడ్డారు. ఎందుకంటే అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించి వెళ్ళారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందాయి. క్షతగాత్రులకు ఆస్పత్రులలో చికిత్స జరుగుతోంది. ఈ ప్రమాదంపై విచారణ మొదలైంది కూడా.

కనుక ఈ ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన స్పందించిన తీరు సరిగా లేదని ఆరోపించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగితే సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు ఎప్పుడు వచ్చారో కూడా తెలీదని జగనే చెప్పుకున్నారు.

నిజానికి సిఎం చంద్రబాబు నాయుడు క్షణం కూడా తీరిక ఉండదు. కానీ ఈ ప్రమాదం జరిగిన రెండు గంటలలోనే ఆయన హోమ్ మంత్రి అనిత వంగలపూడిని ప్రెస్‌మీట్‌ పెట్టి పరిస్థితిని ప్రజలకు వివరించమని ఆదేశించారు.

ప్రమాదం జరిగిన మర్నాడు అంటే నిన్న గురువారం సిఎం చంద్రబాబు నాయుడు బాధితులని పరామర్శిస్తుంటే, జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో కడప జిల్లా వైసీపి నేతలతో సమావేశంలో ఉన్నారు! ఇదే ఇద్దరి మద్య తేడా ఎంత ఉందో తెలియజేస్తోంది.

జగన్‌ మరో అర్ధం పర్ధం లేని ఆరోపణ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగితే సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశ్రమల గేట్ల వద్ద కుర్చీలు వేసుకొని కూర్చొని ఎప్పుడు ప్రమాదం జరుగుతుందా… ఎప్పుడు జనాలు చచ్చిపోతారా? అని ఎదురు చూడాలా?

అసలు అచ్యుతాపురం ప్రమాదం జరిగిన గంటలోపే అగ్నిమాపక సిబ్బంది, జిల్లా ఎస్పీ, ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు, స్థానిక టిడిపి నేతలు అందరూ అక్కడకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అ మంటలు ఆర్పి శిధిలాలు తొలగించి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీయడానికే 4-5 గంటల సమయం పట్టింది.

క్షతగాత్రులను తరలించేందుకు అరడజను అంబులెన్సులు ఏర్పాటు చేసి వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఆలోగానే హోమ్ మంత్రి అనిత వంగలపూడి ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు. ప్రమాదం జరిగిన 12-14 గంటల్లోనే ఎక్స్‌గ్రేషియా చెక్కులు కూడా అందించారు. అయినా ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదని జగన్‌ విమర్శించడం సిగ్గుచేటు కాదా?

మరో విషయం ఏమిటంటే ఈ ఘటన జగన్‌కి పరామర్శకి, శవరాజకీయాలకి, దాంతో రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించుకుంటారు. కనుక మరో రెండు మూడు రోజుల తర్వాత ఈ విషయమే మాట్లాడరు. వేరే కొత్త అంశంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు.

కానీ జగన్‌ కంటే ప్రభుత్వానికే ఎక్కువ బాధ్యత ఉంది. బాధితులు, వారి కుటుంబాలని ఆదుకోవడం, ఈ ప్రమాదంపై విచారణ జరిపించడం, కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం వంటి ప్రక్రియ చాలా ఉంటుంది. ఇది గాక ఈ ప్రమాదంపై అప్పుడే జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు పంపింది. దానికీ ప్రభుత్వం జవాబు ఇచ్చుకోవలసి ఉంది. కనుక జగన్‌ చేస్తున్న ఈ శవరాజకీయాలకు పార్టీ నేతల చేత ధీటుగా జవాబు చెప్పించడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories