ఓ పక్క జగన్‌, మరోపక్క ఐప్యాక్‌ పిండేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలని

YSRCP-YS-Jagan-I-PAC-Sitting-MLAఒక్కోసారి రాజకీయపార్టీలకు అన్నీ కలిసివచ్చి ఎన్నికలలో ప్రభంజనాలు సృష్టిస్తుంటాయి. 2014 ఎన్నికలలో టిడిపి, 2019లో వైసీపీ ప్రభంజనాలను అందరూ చూశారు. కానీ ప్రతీసారి ప్రభంజనం సాధ్యం కాదు. ప్రభుత్వాన్ని మార్చేయాలనే ఆలోచన ప్రజలలో అంతర్లీనంగా బలంగా ఏర్పడినప్పుడే అటువంటి ప్రభంజనాలు సునామీలా వస్తుంటాయి.

వచ్చే ఎన్నికలలో అన్ని సీట్లు (175) మేమే గెలుచుకొంటామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెపుతున్నారు. అంటే మరో ప్రభంజనం ఉంటుందని చెపుతున్నట్లే భావించవచ్చు. కానీ వాస్తవ పరిస్థితులను నిష్పక్షపాతంగా పరిశీలిస్తే, ఈ ఎన్నికలలో వైసీపీకి ఎదురీత తప్పదని స్పష్టంగా కనబడుతోంది.

ADVERTISEMENT

గత ఎన్నికలలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించిన ఐప్యాక్ ఈసారి 50-60 ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని వారిని మార్చక తప్పదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారి సంఖ్య 27కి తగ్గింది. అంటే ఈ రెండు మూడు నెలల్లోనే మిగిలిన ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకొన్నారా?మూడు నెలల్లోనే వారిపై ప్రజలలో సదాభిప్రాయం ఏర్పడిందా?అంటే కాదనే గడప గడపకి కార్యక్రమం స్పష్టం చేస్తోంది. ఐప్యాక్ కూడా అదే చెపుతోంది!దాని నివేదికల ఆధారంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల మద్యకు వెళ్ళాలని ఒత్తిడి చేస్తున్నారు. మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవలేకపోతే మీకు మునుపటి గౌరవం ఉందని సిఎం జగన్మోహన్ రెడ్డి వారి మొహం మీదనే చెప్పేశారు.

ప్రజలలో గర్వంగా డాబు వెలగబెడుతూ తిరిగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ పక్క తమ అధినేతకు మరోపక్క ఐప్యాక్ సిబ్బందికి కూడా భయపడాల్సివస్తోంది. ఇద్దరి మద్య చెరుకుపిప్పిలా నలిగిపోతున్నారు. బహుశః ఈ ఒత్తిళ్ళు భరించలేకనో లేదా వచ్చే ఎన్నికలలో ప్రభంజనాలు ఉండవని గ్రహించినందునో తెలియదు గానీ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ నుంచి తప్పుకొని తమ వారసులను బరిలో దించాలనుకొంటున్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డికే చెప్పారు. కానీ వచ్చే ఎన్నికలలో వారసులను దించి రిస్క్ తీసుకోలేనని సిఎం జగన్ చెప్పడం గమనార్హం. అంటే వారికి, వారి అధినేతకు వచ్చే ఎన్నికలలో ఎదురీత తప్పదని అర్దమయినట్లు భావించవచ్చు.

ఇక ఐప్యాక్ నిశబ్ధంగా రాష్ట్రంలో తనపని తాను చేసుకుపోతోంది. అయితే అది వైసీపీ ప్రత్యర్దులను ఏవిదంగా దెబ్బతీయాలి? వైసీపీని ఏవిదంగా ప్రమోట్ చేసి వచ్చే ఎన్నికలలో గెలిపించాలని మాత్రమే ఆలోచిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇంత దిగులుపడేవారే కారు. కానీ అది వారి పనితీరుపై కూడా సర్వేలు చేసి నివేదికలు ఇస్తుండటమే ఆందోళనకరంగా మారింది.

వారి పనితీరుతో పాటు మిగిలిన ఈ 19 నెలల్లో సిఎం జగన్ నిర్ణయాలు, ప్రజలపై ఆ ప్రభావం, సంక్షేమ పధకాలు అమలు, ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మద్య సంబంధాలు వంటి చాలా అంశాలు ఎన్నికలని ప్రభావితం చేస్తాయి. ఇవికాక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, వాటితో మారే బలాబలాలు అదనం.

కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అధినేత మెప్పుకోసం చంద్రబాబు నాయుడుని, టిడిపి నేతలను, మీడియాను, అమరావతి రైతులను తిడుతూ కూర్చోంటే సరిపోదని ఇటీవల తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలోనే స్పష్టం అయ్యింది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై చాలా ఒత్తిడి ఉందని స్పష్టమవుతోంది కనుక అది భరించలేకపోతే రాజీనామాలు, వలసలు మొదలవుతాయని అందరికీ తెలుసు.

గత ఎన్నికలలో వైసీపీకి అన్నీ కలిసి వచ్చాయి కనుక ఐప్యాక్ వ్యూహాలు ఫలించాయి. కానీ ఈసారి ఎదురీత తప్పదని స్పష్టం అవుతున్నప్పుడు కూడా ఐప్యాక్ వైసీపీని మళ్ళీ గెలిపించగలిగితే చాలా గొప్ప విషయమే.

ADVERTISEMENT
Latest Stories