ఇప్పుడు చిన్నారులు సైతం మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్ వ్యసనానికి అలవాటుపడ్డారు. టీనేజ్, యువత సోషల్ మీడియా, రీల్స్, లైక్స్, వ్యూస్ కోసం ఆరాటపడుతోంది. కానీ తెలంగాణలో ఓ పన్నెండేళ్ళ బాలిక మాత్రం బాల్యం నుంచే తండ్రితో కలిసి పచ్చదనం కోసం పనిచేస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి ప్రకాశ్. ఆయన కుమార్తె బ్లెస్సీ ప్రస్తుతం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.
ఇతర పిల్లలు మొబైల్ ఫోన్స్, సినిమాలు, ఆటపాటలకు ప్రాధాన్యం ఇస్తే బ్లేస్సీ మాత్రం పచ్చదనం పెంచడానికి కృషి చేస్తోంది. ఆమె కూడా తండ్రి ప్రేరణతో విత్తనాలు సేకరించి వాటితో ‘సీడ్ బాల్స్’ తయారు చేయడం నేర్చుకుంది. ఇప్పటి వరకు ఆమె రెండున్నర లక్షల సీడ్ బాల్స్ తయారు చేసి వాటిని చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో జల్లుతూ పచ్చదనం పెంచింది.
ఈ ఏడాది మరో 15,000 సీడ్ బాల్స్ తయారుచేసి అన్ని మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వయసులోనే భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం, ప్రకృతిని కాపాడుకోవాలనే ఆలోచన కలగడం, అందుకోసం నిరంతరం శ్రమించడం నిజంగా చాలా గొప్ప విషయం.
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ జీవితానికి కొలమానం కాదని, పుట్టుకకు సార్థకత తీసుకురావడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేసి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకోవడమే ముఖ్యమని బ్లెస్సీ ఆచరణలో చూపుతోంది.
ఆమె నుంచి ఒక్కరు స్ఫూర్తి పొందినా వేలాది పచ్చటి చెట్లకు ప్రాణం పోసినట్లే అవుతుంది. బ్లెస్సీ వంటి మరో వంద మందిని తయారుచేయగలిగినా దేశానికి, రాష్ట్రానికి అది గొప్ప సంపదగా నిలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి చిన్నారులను, వారి సేవలను గుర్తించి తగిన ప్రోత్సాహం అందిస్తే మరెందరికో స్ఫూర్తిగా మారే అవకాశం ఉంది.




