తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్ ఆయనకు కీలకమైన హోమ్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. దీనితో మిగిలిన కేబినెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆశావహులు ఇప్పటికే తమ ప్రయత్నాలు తాము మొదలు పెట్టారు. ఈనెల 17న మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. ఆరోజు 13 మందితో ప్రమాణం చేయించనున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారం కేబినెట్ లో మంత్రుల సంఖ్య మొత్తం శాసనసభలో 15% కు మించకూడదు.
[m9ad]
ఈ క్రమంలో 17 మంది మంత్రులు ఉండవచ్చు. అయితే ఇప్పుడు 13 మందికి అవకాశం కల్పించి.. మిగిలిన మూడు స్థానాలను పార్లమెంటు ఎన్నికల నాటికి భర్తీ చేయవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విస్తరణలో కడియం శ్రీహరి, గత కేబినెట్‌లోని పలువురికి మళ్లీ అవకాశం రావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఓడిపోయిన నలుగురి స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంటుంది. మొట్టమొదటి సారిగా తెలంగాణాలో మహిళా మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.
తెరాస తరపున ముగ్గురు మహిళలు గెలిచారు. అయితే సభాపతి పదవికి మహిళా సభ్యురాలిని ఎంపిక చేస్తే మంత్రిపదవికి పోటీ తగ్గుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. పాత వారిని ఎక్కువగా తీసుకుంటే ఒక్కరిద్దరు మినహా మిగిలిన వారందరికీ శాఖల మార్పు ఖాయమని అంటున్నారు. ఈ మేరకు కేసీఆర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఒక వారంలోనే పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుండడంతో ఆలోగానే మంత్రుల ప్రమాణస్వీకారం అయిపోవాలని కేసీఆర్ అనుకుంటున్నారట.
దీనితో మంత్రులు జిల్లాలకు వెళ్లి ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చెయ్యవచ్చని ప్లాన్. దగ్గర్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో కేబినెట్ స్వరూపం కీలకం కాబోతుంది. అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ వ్యూహమట. గత ప్రభుత్వంలో మాదిరిగానే కేటీఆర్ కు ఈ సారి కూడా అత్యధిక పోర్ట్ ఫోలియోలు దక్కే అవకాశం మెండుగా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు భారీ మెజారిటీలతో గెలవడంతో ఈ సారి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. దీనితో కేబినెట్ విస్తరణ కష్టసాధ్యంగా మారింది.



