ఎన్నికలలో ఎటువంటి పార్టీనైనా గెలిపించే కాంట్రాక్టు తీసుకొంటున్న ‘ఐప్యాక్’ను అపర చాణక్యుడుగా పేరుగాంచిన తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా ప్రయత్నిద్దామనుకొన్నారు. కానీ అది తమ పార్టీని తన చేతుల్లోకి తీసుకొంటుందని గ్రహించిన కేసీఆర్ దానిని వెంటనే వదిలించుకొన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని అధికారంలోకి తెచ్చి పెట్టి, ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే జగన్మోహన్ రెడ్డి కల నెరవేర్చినందుకు వచ్చే ఎన్నికలలో కూడా దాని సేవలు ఉపయోగించుకొంటున్నారు.
ఓ రాజకీయ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తే కాస్త అతిశయం పెరుగుతుంది. బహుశః అదేవిదంగా వైసీపీకి రెండోసారి సేవలందిస్తున్న ఐప్యాక్‌కు కూడా అతిశయం పెరిగినట్లుంది. ప్రభుత్వానికి పేరు తెచ్చేందుకు గడప గడపకి వంటి కార్యక్రమాలను రూపొందించి ఇస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ ఐప్యాక్ సూచన మేరకు వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున “మా నమ్మకం నువ్వే జగన్… మా భవిష్యత్ నువ్వే జగన్…” అంటూ ఇళ్లకు స్టికర్స్ వేసే కార్యక్రమం చేపట్టింది. కానీ మొదట్లోనే ఆ కార్యక్రమంతో వైసీపీ నవ్వులపాలైంది.
ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, దాని ఆదారంగా వారికి ర్యాంకులు ఇస్తూ, వాటి ఆధారంగా వచ్చే ఎన్నికలలో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి… ఎవరెవరిని పక్కనపెట్టాలి వంటి సలహాలు ఇస్తుండటంతో వైసీపీలో ఇప్పుడు రెండు ‘పవర్ సెంటర్స్’ తయారయ్యాయి. ఒకటి సిఎం జగన్మోహన్ రెడ్డి కాగా మరొకటి ఐప్యాక్.
అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి కనికరించినప్పటికీ ఐప్యాక్ కనికరించకపోతే మంత్రుల పదవులు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎమ్మెల్యేలైతే మళ్ళీ టికెట్లు రాని పరిస్థితి. కనుక ఈ ఐప్యాక్ తమ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందనే భావన వైసీపీలో చాలామందిలో ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైసీపీలో చిచ్చుకు ఐప్యాక్ సిఫార్సులు, నిర్ణయాలు కూడా ఓ కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. సిఎం జగన్మోహన్ రెడ్డితో ప్రజాప్రతిధుల సమావేశాలంటే, వారి గురించి ఐప్యాక్ ఇచ్చిన రిపోర్ట్ కార్డులు చదవడం, టికెట్లు ఇవ్వనని హూంకరింపులకే పరిమితం అవుతున్నాయి తప్ప తమ సమస్యల గురించి మాట్లాడుకొనే అవకాశం లేకుండా పోతోందని వైసీపీ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అనేక కారణాల వలన వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది. దానిని గుర్తించి సరిదిద్దుకొనేందుకు వైసీపీకి తోడ్పడవలసిన ఐప్యాక్, వైసీపీకి శల్యసారధ్యం చేస్తుండటం విశేషం. ఇందుకు తాజా ఉదాహరణగా ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటించినప్పుడు, మంత్రి ఆదిమూలపు సురేష్ రోడ్డుపై మీడియా ఎదుట చొక్కావిప్పేయడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వాహనంపై ఆయన అనుచరుల రాళ్ళదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పక్కన ఐప్యాక్ సంస్థ ప్రతినిధి ఒకరు కనపడటంతో ఆ సంస్థ వైసీపీకి ఇటువంటి తప్పుడు సలహాలు కూడా ఇచ్చి భ్రష్టు పట్టించేస్తోందా?అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. కనుక 2019లో వైసీపీని గెలిపించిన ఐప్యాకే 2024లో దానిని నిలువునా ముంచేసినా ఆశ్చర్యం లేదు.



