సంక్రాంతి సినిమాలు… చిందర వందర గందరగోళం..!

సంక్రాంతి సినిమాలు... చిందర వందర గందరగోళం..!షుమారుగా ఓ ఆరు మాసాల క్రితం అనుకుంటా… చాలా కాలం తర్వాత మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ ల సినిమాలు పోటీపడుతున్నాయని ఫ్యాన్స్ మాంచి హుషారులో చెప్పుకున్నారు. ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుంటామని సోషల్ మీడియా వేదికగా పోటీలు పడ్డారు. ఈ రెండు సినిమాలకు తోడు ప్రభాస్ సినిమా ‘రాధే శ్యామ్’ కూడా చేరింది.

ఆ తర్వాత ‘ఎఫ్ 3’ వెనువెంటనే ‘బంగార్రాజు’ ఇలా 2022 సంక్రాంతి పర్వదినాన్ని తెలుగు సినీ ప్రేక్షకులకు మరపురానిదిగా చేస్తుందేమో అనిపించే విధంగా క్రేజీ మూవీస్ క్యూ కట్టాయి. కట్ చేస్తే… దసరాకు రావాల్సిన “ఆర్ఆర్ఆర్” వాయిదా పడి, సంక్రాంతిని ఎంపిక చేసుకున్నారు. దీంతో మొదటగా మహేష్ మూవీ అవుట్, ఆ తర్వాత పవన్ మూవీ, ఎఫ్ 3… అన్ని అవుట్ ఆఫ్ సిలబస్ లోకి వెళ్లిపోయాయాయి.

ADVERTISEMENT

సరే 5 కాకపోయినా ఓ రెండు పాన్ ఇండియా మూవీస్ అయినా వస్తాయని ఫిక్స్ అయ్యారు. దీనికి తోడు చివర్లో ‘బంగార్రాజు’ టైం చూసుకుని దిగుతుందని భావించారు. గడిచిన వారం నాటి పరిస్థితిలో మార్పు ఏమి లేదు. కానీ ఎప్పుడైతే ఢిల్లీ పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించారో, పాన్ ఇండియా సినిమాల విడుదలకు పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి.

ఈ క్రమంలోనే ముంబై 50% ప్రకటన, ఇక్కడ నుండి తేరుకునే లోపు తమిళనాడు 50%… ఇక సంక్రాంతికి పాన్ ఇండియా రిలీజ్ లు కష్టమని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోయారు. రావాల్సిన ప్రకటన కొత్త సంవత్సరం నాడు రాక తప్పలేదు. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా ప్రకటన వెలువడడంతో, గత 20 రోజులుగా చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ బూడిదలో పోసిన పన్నీరయ్యింది.

దీంతో ప్రస్తుతం అందరి చూపులు మరో పాన్ ఇండియన్ మూవీ “రాధే శ్యామ్”పై పడ్డాయి గానీ, ఈ సినిమా విడుదల కూడా అనివార్యం అన్న టాక్ వినపడుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా అదుపులోనే ఉండడంతో, ఈ సంక్రాంతికి తెలుగు సినిమాల రిలీజ్ లకు ఇబ్బందులు లేవు. కానీ రిలీజ్ కు రెడీగా ఎన్ని సినిమాలు ఉన్నాయి? అంటే తెల్లమొహం వేయాల్సిందే.

‘ఆర్ఆర్ఆర్’ పుణ్యమా అంటూ సినిమాలన్నీ వాయిదా వేసుకోవడంతో, వాటికి సంబంధించిన ప్యాచ్ వర్క్ కూడా నిదానంగా పూర్తి చేసే క్రమంలో “ఆచార్య, భీమ్లా నాయక్” సినిమాలు నిలిచిపోయాయి. దీంతో సడన్ గా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడడంతో ఈ సంక్రాంతి సీజన్ ను ఏ హీరో పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.

‘భీమ్లా నాయక్’ ప్రొడ్యూసర్ నిర్మించిన మరో సినిమా ‘డీజే టిల్లు’ 14వ తేదీ ప్రకటన వచ్చింది గానీ, ఇది అటు పెద్ద హీరో సినిమా కాదు, అలాగని క్రేజీగా మారిన సినిమా కూడా కాదు. ఎలాగో ఉండబోతోంది అని ఊహించుకున్న తెలుగు సినీ అభిమానులకు ఈ సంక్రాంతి చివరికి చేదు అనుభవాలను మిగిల్చింది. అయితే ఈ ప్రభావం ఒక్క సంక్రాంతి వరకే పరిమితం కాదు.

రానున్న కాలంలో కరోనా కేసులు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున నమోదయితే, ఫిబ్రవరిలో లైన్ లో ఉన్న ‘ఆచార్య, మేజర్, భీమ్లా నాయక్’ సినిమాల రిలీజ్ లు కూడా సందేహమే! మళ్ళీ అందరూ సమ్మర్ సీజన్ అనుకుంటారు గానీ, గత రెండేళ్లుగా సమ్మర్ లోనే కరోనా చేసిన విలయ తాండవం ఎవ్వరూ మరిచిపోలేరు. కనుక మొదటి అయిదు నెలలు సినిమాల గురించి మరిచిపోవడమే!

అప్పటికి ఏపీలో నెలకొన్న టికెట్ల గందరగోళానికి కూడా తెరపడితే, అప్పటికైనా ఉపశమనం లభించినట్లే! లేదంటే రాంగోపాల్ వర్మ అన్నట్లుగా కరోనాను ఏమీ చేయలేక వాయిదాలు వేసుకున్నట్లే, ఏపీలో సానుకూల పరిస్థితులు లేకపోతే మళ్ళీ వాయిదాల పర్వం కొనసాగుతుందేమో చూడాలి. ఇంకా చాలా సమయం ఉంది గనుక ఇప్పుడే ఆలోచనలు చేయడం కూడా వృధా ప్రయాసే!

ADVERTISEMENT
Latest Stories